ప్రపంచానికి వైరస్‌ల పెనుముప్పు!

18 Sep, 2019 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా వందేళ్ల క్రితం అంటే, 1919లో ‘స్పానిష్‌ ఫ్లూ’ మూడొంతుల ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దాదాపు ఐదు కోట్ల మంది మరణించారు. అలాంటి వైరస్‌ ఇప్పుడు ప్రపంచానికి సోకితే కనీసం ఎనిమది కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. ఒకప్పుడు మెల్లగా విస్తరించిన ఈ ఫ్లూ, ఓ దేశానికి చెందిన ప్రజలు, మరో దేశానికి  నిరంతరంగా ప్రయాణిస్తున్న నేటి వేగవంతమైన యుగంలో కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. అదే గనుక జరిగితే అపార జన నష్టంతోపాటు దేశ దేశాల జాతీయ భద్రత అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్‌ నాయకత్వంలోని ‘గ్లోబల్‌ ప్రిపేర్డ్‌నెస్‌ మానిటరింగ్‌ బోర్డ్‌’ సభ్యుల బందం ఈ హెచ్చరికలను చేసింది. ఈ మేరకు ‘ఏ వరల్డ్‌ ఎట్‌ రిస్క్‌’ శీర్షికతో రూపొందించిన ఓ నివేదికను బుధవారం అమెరికాలో విడుదల చేసింది. ‘ఎబోలా’ లాంటి వైరస్‌లు వేగంగా సోకుతున్న నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫ్లూలు ప్రపంచానికి సోకే ప్రమాదం ఉందని, అలాంటి వైరస్‌లను ఇప్పటి నుంచి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్‌ –జనరల్, నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ గో ఆర్లెం బ్రుండట్లాండ్‌ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది. ఏ వైరస్‌ ఏ ప్రాంతాన్నీ, ఏ దేశాన్ని సోకే అవకాశం ఉందో కూడా ప్రపంచ పటంపై మార్కు చేసి చూపించింది. 


1918లో స్పానిష్‌ ఫ్లూ అమెరికాలో విస్తరించినప్పుడు చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న రెడ్‌క్రాస్‌ కార్యకర్తలు

 అంటే నిఫా వైరస్‌ ఏ దేశాన్ని చుట్టు ముడుతుందో, కలరా ఏ దేశాన్ని చికెన్‌ గున్యా, డెంగ్యూలాంటి వైరస్‌లు ఏయే దేశాలు చుట్టుముడుతాయో మ్యాప్‌లో సూచించింది. వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో కూడా సూచించింది. ఇంతకుముందు విడుదలు చేసిన తమ నివేదికను దేశాధినేతలు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అరకొరగానే అమలు చేసినందువల్లనే ఈ రోజు మళ్లీ ఒక నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని బోర్డు వివరించింది. ఎబోలా, జికా, నిపా వైరస్‌లతోపాటు వెస్ట్‌ నైల్‌ వైరస్, డెంగ్యూ, ప్లేగ్, హ్యూమన్‌ మంకీపాక్స్‌ల గురించి హెచ్చరికలు చేసింది. 

మరిన్ని వార్తలు