అంధులకు అండగా..

15 Jul, 2016 15:02 IST|Sakshi
అంధులకు అండగా..

అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఇతరుల సాయం లేకుండా తమ పనులు తామే చేసుకునేందుకు సహకరించే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చేతికి ధరించే ఉంగరంలా ఉండే ఈ అతి చిన్న పరికరం 3.5 మీటర్ల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా ఇట్టే గుర్తించి  వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరాన్ని చేతికి ధరించి ప్రయాణిస్తే నడిచే మార్గంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని సృష్టికర్తలు చెప్తున్నారు.

లైవ్ బ్రెయిలీ అధినేత అభినవ్ వర్మ ఇప్పుడు అంధులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే అతి చిన్న పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని చేతికి ధరిస్తే మూడు, నాలుగు మీటర్ల ముందుగానే వారికి వచ్చే అడ్డంకులను గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది.  సెకనులో 50వ వంతు సమయంలో అడ్డంకులను గుర్తించగలిగే ఈ పరికరంతో పాటు, దీనికి అనుసంధానంగా బ్యాటరీతో నడిచే మరో రెండు పరికరాలను కూడ అభినవ్ తయారు చేశారు. ఈ  'మినీ'  పరికరం అంధుల సాధారణ అవసరాలకు ఉపయోగపడటంతోపాటు, దీనిద్వారా విద్యార్థులు తమ పుస్తకాలను ఆడియో రూపంలో రికార్డు చేసుకొని వినే సదుపాయం కూడ ఉంది.   ఐఐటీ ఖరగ్ పూర్  విద్యార్థి అభినవ్ తోపాటు అతడి స్నేహితుల బృందం విభిన్న ఆలోచనతోనే ఈ చిన్న పరికరం రూపం దాల్చింది. అంధులు కర్రసాయం లేకుండా నడవలేరా? వారు సాధారణ ప్రజల్లా నడవాలంటే ఏం చేయాలి అన్న కోణంలో ఆలోచించిన విద్యార్థులు ఈ చిన్న గాడ్జెట్ ను కనుగొనే ప్రయత్నం చేశారు. మూడేళ్ళ క్రితం వారు విద్యార్థులుగా ఉన్నపుడు అంధులకోసం సృష్టించిన గ్లౌవ్స్ వంటి పరికరం విజయవంతం కావడంతో మరింత ఉపయోగంగా ఉండే అతి చిన్న పరికరాన్ని తయారు చేసేందుకు అభినవ్ చదువు పూర్తయిన తర్వాత  సన్నాహాలు ప్రారంభించాడు. తాను స్వయంగా స్థాపించిన ఎంబ్రోస్ కంపెనీలో విభిన్నంగా వస్తువులను రూపొందించే ప్రయత్నం చేశాడు.

అనేక ప్రయోగాలు, ప్రయత్నాల అనంతరం అభినవ్.. కేవలం 29 గ్రాములు బరువుండే అతి చిన్న రింగులాంటి లైవ్ బ్రెయిలీ పరికరాన్ని రూపొందించి విజయం సాధించాడు. చేతికి పెట్టుకునే ఉంగరంలా ఉండే ఈ చిన్న రింగు.. అంధులు వాడే కేన్ కు పది రెట్లు తేలిగ్గా ఉండటంతోపాటు... కేవలం 50 సెకన్ల లోపే అడ్డు వచ్చే వస్తువులను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు వస్తువు దూరం, బరువు వంటి విషయాలను బట్టి పరికరం వైబ్రేట్ అవుతుంది.  తాము రూపొందించిన ఈ చిన్న పరికరం సహాయంతో దృష్టిలోపం ఉన్నవారు నడవడమే కాదు ఏకంగా పరుగులు కూడా పెట్టొచ్చని అభినవ్ బృందం చెప్తున్నారు.

మరిన్ని వార్తలు