ప్రపంచ పొట్టి మనిషి మగర్‌ మృతి

18 Jan, 2020 16:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ లోకి ఎక్కిన నేపాల్‌కు చెందిన 27 ఏళ్ల ఖగేంద్ర థాప మగర్‌ శుక్రవారం రాత్రి మరణించారు.  2.4 అంగులాల ఎత్తు మాత్రమే ఉన్న మగర్‌ గత కొంత కాలంగా నిమోనియాతో బాధ పడుతున్నారని, ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో మరణించారని సోదరుడు మహేష్‌ థాప మగర్‌ తెలిపారు. మగర్‌ తన 18వ ఏట సందర్భంగా 2010లో ప్రపంచంలోనే పొట్టి మనిషిగా ‘గిన్సిస్‌’ సర్టిఫికేట్‌ అందుకున్నారు. అదే సంవత్సరం జరిగిన నేపాల్‌ భామల అందాల పోటీలో హల్‌చల్‌చేసి విజేతలతో ఫొటోలకు ఫోజిచ్చారు. 

‘ప్రపంచంలోనే అత్యంత పొట్టివాడు పుట్టిన నేపాల్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎంతైన శిఖరం అందాలు’ నేపాల్‌ పర్యాటక శాఖ ప్రచారానికి మగర్‌ అంబాసిడర్‌గా పనిచేసి పలు దేశాలు తిరిగారు. ప్రపంచంలోని అత్యంత పొట్టి అబ్బాయిలను, అమ్మాయిలను కలుసుకున్నారు. పొట్టి అమ్మాయిని కలుసుకోవడానికి ఆయన భారత్‌ దేశానికి వచ్చారు. ఆ తర్వాత నేపాల్‌లోనే పుట్టిన చంద్ర బహదూర్‌ డాంగీ (ఒక అడుగు 7.9 అంగుళాలు) చేతుల్లో మగర్‌ గిన్నీస్‌ రికార్డు కోల్పోయారు. 2015లో డాంగీ మరణించడంతో మళ్లీ ప్రపంచ రికార్డు మగర్‌కే దక్కింది. 


 

మరిన్ని వార్తలు