‘వరల్డ్‌ వార్‌ వన్‌’ విస్మరించిన జర్మనీ

12 Nov, 2018 18:17 IST|Sakshi

బెర్లిన్‌ : ‘జర్మనీ జీవించేందుకు మేము చనిపోయాం. జర్మనీ జీవించడంలో మేము బతికుంటాం’ అన్న నినాదం బెర్లిన్‌లోని కొలంబియాడామ్‌ శ్మశానంలో నేల కొరిగిన ఓ సైనికుడి విగ్రహం పక్కన రాసి ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఏడువేల మంది జర్మనీ సైనికులు సంస్మరణార్థం ఈ విగ్రహాన్ని 1925లో అప్పటి జర్మనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిడికిలి మాత్రమే బయటకు కనిపించేలా బ్లాంకెట్‌ కప్పిన అమరసైనికుడి విగ్రహం నెత్తిన టోపీ, పక్కన తుపాకీ ఉన్నట్లుగా చెక్కిన ఈ రాతి విగ్రహం వద్ద మొదట్లో ప్రభుత్వ పెద్దలు, ప్రజలు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం అమర సైనికులను జర్మనీ దాదాపు విస్మరించింది.

మొదటి సంవత్సరం యుద్ధం ముగిసి ఆదివారం నాటికి సరిగ్గా వందేళ్లు పూర్తియిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతోపాటు పారిస్‌లో వివిధ దేశాధినేతల సమక్షంలో భారీ ఎత్తున స్మారక కార్యక్రమాలు జరిగాయి. పారిస్‌ ఆహ్వానాన్ని అందుకున్నప్పటికీ జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దేశంలో కూడా పెద్దగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఒక్క పార్లమెంట్‌ హాలులో స్మారక ఉపన్యాసంతో మొక్కుబడిగా నూరేళ్ల స్మారక దినాన్ని ముక్తిసరిగా ముగించింది. ఎందుకు?

మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన నష్టం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువ నష్టం వాటిల్లడం. మొదటి ప్రపంచ యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కావడం కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా దేశం రాజరిక వ్యవస్థ నషించి రిపబ్లికన్‌ వ్యవస్థ ఏర్పడడం, ఆ రిపబ్లికన్‌ వ్యవస్థ నియంత హిట్లర్, నాజిజిం పుట్టుకకు కారణం అయింది. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి బెర్లిన్‌తోపాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారక భవనాలు, మ్యూజియంలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి అతి తక్కువ స్మారక మ్యూజియంలు ఉన్నాయి. కొలంబియాడామ్‌ శ్మశానంలోని అమర వీరుల సమాధాల వద్దగానీ, వారి స్మారక విగ్రహం వద్దకుగానీ పుష్మ నివాళులర్పించేందుకు ఈ మధ్య ఎవరూ రావడం లేదని స్థానికులు తెలిపారు.

2017లో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలినా మార్కెల్‌ సైనిక స్మారక విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే ఈసారి ఆమె అక్కడికి కూడా పోలేదు. నాటి యుద్ధానికి కారణమైన దేశాల్లో జర్మనీ ఒకటి అవడమే కాకుండా ఆ యుద్ధంలో ఓటమిని అంగీకరించమనే ఆత్మన్యూనతా భావం వల్ల కూడా జర్మనీ నూరేళ్ల కార్యక్రమాన్ని పట్టించుకోక పోవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమం కోసం పలు దేశాలు ఏడాది ముందుగానే చరిత్రకారులతో, ఉన్నతాధికారులతో కమిటీలు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం, ప్రపంచంపై దాని ప్రభావం, ఫలితాలు అంశాలపై చరిత్రకారులతో పుస్తకాలు రాయించి ప్రచురించడంతోపాటు తమ దేశాల్లో పలు స్మారక భవనాలను కూడా నిర్మించాయి. సెమినార్లు, సదస్సులను నిర్వహించాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా