పిన్న వయస్సులో దేశ ప్రధానిగా సనా రికార్డు

9 Dec, 2019 11:42 IST|Sakshi

హెల్సెంకీ: ఫిన్‌లాండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ సనా మారిన్‌ దేశ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అంటీ రిన్నే ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సనాను సోషల్‌ డెమొక్రాట్‌ పార్టీ సభ్యులు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో(34) అత్యున్నత పదవి అలంకరించిన మహిళగా సనా చరిత్రకెక్కారు. కాగా పోస్టల్‌ ఉద్యోగుల జీతాల కోతలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోషల్‌ డెమొక్రాట్లు- సెంటర్‌ పార్టీ నేత్వత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రిన్నే తీరుపై విమర్శలు గుప్పించింది. దీంతో రినే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఈ క్రమంలో ఆదివారం ప్రధానిగా ఎన్నికైన అనంతరం సనా మాట్లాడుతూ... ‘ తిరిగి నమ్మకాన్ని సంపాదించడానికి ఎంతగానో కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేనెప్పుడూ వయస్సు గురించి గానీ, మహిళను అనే విషయం గురించి గానీ ఆలోచించలేదు. ప్రజల నమ్మకాన్ని చూరగొని వారికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేస్తాం’ అని పేర్కొన్నారు. కాగా మంగళవారం ఆమె ఫిన్‌లాండ్‌ ప్రధానిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఇక సనా కంటే ముందు ఉక్రెయిన్‌ ప్రధాని ఓలెక్సీ హాంచరుక్‌(35) అత్యంత పిన్న వయస్సులో అత్యున్నత పదవి దక్కించుకున్న మహిళగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. కాగా ఫిన్‌లాండ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలన్నీ మహిళల నేతృత్వంలోనివే(సనా మారిన్‌(34)- సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ, కాట్రీ కుల్ముని(32)- సెంటర్‌ పార్టీ, లీ అండర్సన్‌(32)- లెఫ్ట్‌ అలయన్స్‌, మారియా ఓహిసాలో(34)- గ్రీన్‌ లీగ్‌, అన్నా మజా హెర్నిక్సన్(55)- స్వీడిష్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఫిన్‌లాండ్‌) కావడం విశేషం.  

>
మరిన్ని వార్తలు