అసలైన ఏలియన్స్ అన్వేషణ మొదలైంది!

25 Sep, 2016 14:23 IST|Sakshi
అసలైన ఏలియన్స్ అన్వేషణ మొదలైంది!

బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ తన పని ప్రారంభించింది. నైరుతి చైనా గిజూ ప్రావిన్స్లోని పర్వతప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ టెలిస్కోప్ ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిని ప్రారంభించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. విశ్వంలో జీవం కోసం మానవులు సాగిస్తున్న అన్వేషణను ఈ రేడియో టెలిస్కోప్ మరింత ప్రభావవంతంగా చేపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్(ఎఫ్ఏఎస్‌టీ) పేరుతో నిర్మితమైన దీని కోసం చైనా 1.2 బిలియన్ యువాన్‌లను ఖర్చుచేసింది. ఇప్పటివరకూ ప్రపంచంలో పెద్ద టెలిస్కోప్గా పేరున్న ప్యూర్టోరికో లోని అరెసిబో టెలిస్కోప్ను ఎఫ్ఏఎస్‌టీ ద్వితీయ స్థానంలోకి నెట్టేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉంటుందంటే ఎఫ్ఏఎస్టీ ఎంత భారీ టెలీస్కోపో అర్థం చేసుకోవచ్చు.

చైనా తన అభివృద్ధిని చాటుకునేలా సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అంతరిక్ష రంగంలోనూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2020 నాటికి శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకునే దిశగా చైనా అడుగులేస్తోంది. ఎఫ్ఏఎస్‌టీ నిర్మాణాన్ని 2011లో చైనా ప్రారంభించింది. టెలిస్కొప్ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేందుకు గాను ఆ ప్రాంతంలో 5 కిమీ పరిధిలో ఉన్న సుమారు 10 వేల మందిని స్థానిక ప్రభుత్వం ఖాళీ చేయించింది.
 

మరిన్ని వార్తలు