ప్రారంభంకానున్న మరో ప్రపంచ అద్భుతం

1 Jun, 2016 15:24 IST|Sakshi
ప్రారంభంకానున్న మరో ప్రపంచ అద్భుతం

స్విట్జర్లాండ్: మానవ సృష్టిలో మరొక అద్భుతం ఆవిష్కృతమవనుంది. ప్రపంచంలోని పొడవైన రైలు సొరంగ మార్గం బుధవారం అధికారికంగా స్విట్జర్లాండ్ లో ప్రారంభంకానుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దీని పొడవు 57 కిలోమీటర్లు. గోట్టార్డ్ అనే పెద్ద రాతి ఫలకాన్ని తొలిచి రైలు కోసం నిర్మించిన ప్రత్యేక సొరంగ మార్గం ఇది. యురిలోని సెంట్రల్ క్యాంటన్ లోగల ఆల్ఫ్‌ నుంచి సౌతర్న్ డికినో క్యాంటన్ వరకు దీనిని నిర్మించారు. ఈ సొరంగం నిర్మాణానికి తొలిరూపును 1947లోనే ప్రముఖ స్విట్జర్లాండ్ ఇంజినీర్ కార్ల్ ఎడ్వర్డ్ గ్రునర్ గీశారు.

కానీ, కొంతమంది పాలకుల నిర్లక్ష్యం కారణంగా అది వివిధ దశల్లో ప్రారంభమవుతూ ఆగిపోతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ పనిని 1999లో ప్రారంభించారు. దాదాపు 17 సంవత్సరాల కష్టంతో దీనిని పూర్తి చేశారు. దీనికోసం వారు అక్షరాల 12 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్, ప్రెంచ్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే, ఇటలీ ప్రధాని మాటియో రెంజీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో డిసెంబర్ నుంచి పనిచేయనుంది. ఈ సొరంగ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో జ్యూరిచ్ నుంచి మిలాన్ వరకు రెండుగంటల 40 నిమిషాల ప్రయాణం పడుతుంది. గతంలో మరో గంట అదనంగా పట్టేది.

మరిన్ని వార్తలు