ప్రేమవల్లే 119వ పుట్టిన రోజుకు సిద్ధమవుతున్నా..

19 Jan, 2016 17:47 IST|Sakshi
ప్రేమవల్లే 119వ పుట్టిన రోజుకు సిద్ధమవుతున్నా..

అర్జెంటీనా: వంద సంవత్సరాలుమించి బతకడమే కష్టమని మొన్నటి వరకు అనుకోగా 110 ఏళ్లు కూడా బతికి ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తులుగా రికార్డులు నెలకొల్పుతున్నవారు ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇక తాజాగా, అర్జెంటీనాలోని ఓ బామ్మ మాత్రం ఏకంగా 118 ఏళ్లను పూర్తి చేసుకొని తన 119వ పుట్టిన రోజు కేకును కట్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

అర్జెంటీనాలో ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న ఆ శతాధిక యోధురాలి పేరు సెలినా డెల్ కార్మెన్ ఒలియా. ఆమె బ్యూనస్ ఎయిర్స్ లో తన కుమారుడు అల్బర్టో, దత్తత తీసుకున్న కుమార్తె గ్లాడీతో ఉంటుంది. ఆమెకు పన్నెండు మంది సంతానం. ఆమె పేరిట ప్రపంచంలోనే అత్యధిక వయోధికురిలాగా కూడా రికార్డు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 15, 1897న ఆమె జన్మించిందని, ఆమెకు జనన నమోదు పత్రం కూడా ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఇంత సుదీర్ఘ కాలం జీవించడానికి గల కారణాలను పంచుకుంది.

'బాగా కష్టపడి పనిచేయడం, ఎక్కువగా నడవడంతోపాటు చుట్టూ ప్రేమతో నిండిన మనుషులు ఉండటం, పొగ, మద్యం అలవాటు లేకపోవడంవంటి కారణాలు నా జీవితాన్ని సుదీర్ఘంగా ఆరోగ్యంతో ఉంచాయి' అని సెలినా తెలిపింది. అయితే, తన సంతానం గురించి తెలిపిన ఆ బామ్మ తనకు ఎంతమంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారనే విషయం మాత్రం చెప్పలేకపోయింది. ఆమె ఇంట్లోని పిల్లల్లో కొందరు పాఠశాలకు వెళుతుండగా, మరికొందరు తమ సొంత కోళ్ల ఫారంలలో పనికి వెళుతుంటారు. 

మరిన్ని వార్తలు