పాలు వద్దు.. మందే ముద్దు..

25 Jun, 2014 11:04 IST|Sakshi
పాలు వద్దు.. మందే ముద్దు..


వీడి పేరు చెంగ్ చెంగ్.. వీడో తాగుబోతు!! ఫొటో చూశారుగా.. ఇంకా డౌటా.. వయసు రెండేళ్లే అయినా.. వాళ్ల నాన్న కన్నా వేగంగా బీరు లేదా వైన్ తాగేస్తాడట. పాలు కనిపిస్తే యాక్ అంటూ మొహం తిప్పేసుకునే చెంగ్‌చెంగ్.. మందు కనిపిస్తే మాత్రం ముందు నాకే అంటాడు. ప్రస్తుతం చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో వీడి గురించే చర్చ. ప్రపంచంలోనే అత్యంత పిన్న తాగుబోతుగా భావిస్తున్న చెంగ్‌చెంగ్‌ను ఎలా దారిలో పెట్టాలన్న దానిపైనే అధికారులు చర్చిస్తున్నారు. అలాగని వీడిని అనడానికి లేదు లెండి.. ముందు వీడి నాన్నను అనాలి.

ఎందుకంటే.. చెంగ్‌కు పది నెలల వయసున్నప్పుడు ఓ రోజు తెగ ఏడుస్తుంటే.. వాళ్ల నాన్న వైన్ చుక్క నాలికకు నాకించాడంట. అప్పట్నుంచి అది అలవాటై.. చివరికి గ్రహపాటుగా మారింది. ఏడాది వయసొచ్చేసరికి బీరు అలవాటైంది. ఇప్పుడైతే.. ఓ బాటిల్ బీరును ఈజీగా తాగేస్తాడు. వీడి కళ్లు ఎప్పుడు మందు బాటిల్ మీదే ఉంటాయట. ఇంట్లో వాళ్లు పార్టీ అంటూ బాటిల్ బయటకు తీస్తే.. మరి నాకో అంటూ మందు కోసం మారాం చేస్తాడు. ఒక్కోసారి ఎంత గొడవ చేస్తాడంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం వైన్ ఇవ్వాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

చెంగ్ చెంగ్ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా గగ్గోలు రేగింది. వెంటనే ఈ అలవాటు మానిపించకపోతే.. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తల్లిదండ్రుల వల్లే వీడిలా చెడిపోయాడని.. చెంగ్‌ను ప్రభుత్వ సంరక్షణ నిలయానికి పంపించాలని సామాజిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అటు వీడి తల్లిదండ్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. చెంగ్‌కు మందుకు బదులు జ్యూస్ వంటివి అలవాటు చేయించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే.. తమపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందేమోనని వీరు భయపడుతున్నారు.  
 
 

మరిన్ని వార్తలు