ఇటలీలో ఆగని విలయం

29 Mar, 2020 03:48 IST|Sakshi

610000

ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య

కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్‌

కరోనా మృతుల సంఖ్య..30,000

కరోనా బాధిత దేశాలు..183

గత 24 గంటల్లో స్పెయిన్‌లో మృతులు..832

అమెరికాలో మొత్తం కేసులు 1,00,000

ఇటలీలో మొత్తం మృతులు..10,000

స్పెయిన్‌లో మొత్తం మృతుల సంఖ్య..5,690

కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్‌ తదితర దేశాలు ఆ పేరు చెబితేనే వణికిపోతున్నాయి. వైరస్‌ బాధితులు అంతకంతకు పెరిగిపోవడం, వందల సంఖ్యలో మృతులు నమోదవుతుండటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. యూరప్‌లోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆర్థిక మాంద్యం కోరల్లో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.

ఇక, అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధిత  రాష్ట్రాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చరిత్రాత్మక బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. మరోవైపు చైనాలోని సెంట్రల్‌ హుబాయ్‌లో లాకౌట్‌ ఎత్తేయడంతో భారీ సంఖ్యలో జనం పొరుగునే ఉన్న జియాంగ్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. దీనికి సంబంధించిన వీడియోలు చైనా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

వాషింగ్టన్, రోమ్‌: 183 దేశాల్లో కరోనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా యూరప్‌ దేశాలు  కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడిపోతున్నాయి. రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 6 లక్షలకు పైగా నమోదయ్యాయి. ఇటలీలో శుక్రవారం రికార్డు స్థాయిలో 969 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది.  స్పెయిన్‌లో గత 24 గంటల్లో 832 మంది మరణించారు. దీంతో మొత్తం మృతులు 5,690కి చేరుకున్నాయి.   యూరప్‌లో అత్యధిక దేశాలు లాకౌట్‌లో ఉండడంతో ఆర్థిక మాంద్యం కోరలు చాస్తోంది. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ వంటి దేశాలన్నీ ఏకతాటిపై నిలిచి ఈ విపత్తుని ఎదుర్కోవాలని, మిగిలిన యూరప్‌ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభం నుంచి తమను బయట పడేయాలని ఇటలీ ప్రధానమంత్రి గియూసెప్పె కోంటే అన్నారు.  (కరోనా వైరస్‌ : ప్రతి 22 మందిలో ఒకరు మృతి)

ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండే న్యూఆర్లియన్స్‌లో జాక్సన్‌ స్క్వేర్‌ నిర్మానుష్యమైంది

ఆర్థిక ప్యాకేజీపై ట్రంప్‌ సంతకం
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆ దేశంలో లక్షకు పైగా కేసులు నమోదైతే, 1700 మందికి పైగా మరణించారు. కరోనా బాధిత  రాష్ట్రాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చరిత్రాత్మక బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. ‘‘కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు సాయం అందుతుంది. కంటికి కనిపించని శత్రువు మనపై దాడి చేసింది. మనం అంతకంటే గట్టిగా దానిపై ప్రతిదాడికి దిగాం’’ అని చెప్పారు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సహాయ ప్యాకేజీపై సంతకం చేశానని అన్నారు.  

చైనాలో ఘర్షణలు  
చైనాలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్‌ బట్టబయలైన హుబాయ్‌ ప్రాంతంలో ప్రజాగ్రహాన్ని పోలీసులు చవిచూడాల్సి వచ్చింది. సెంట్రల్‌ హుబేలో లాకౌట్‌ ఎత్తేయడంతో భారీ సంఖ్యలో జనం పొరుగునే ఉన్న జియాంగ్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ రెండు ప్రావిన్స్‌ల మధ్య వంతెన మీద నుంచి ప్రజలు దాటడానికి ప్రయత్నించడంతో జియాంగ్‌ సరిహద్దుల్లో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోవిడ్‌పై భయంతో వారిని ఆపేశారు. దీంతో ఆగ్రహంతో ప్రజలు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి వ్యాధి లేదని గ్రీన్‌ హెల్త్‌ కోడ్‌ ఇచ్చినా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని వార్తలు