అమెజాన్‌ తగులబడుతోంటే.. అధ్యక్షుడి వెర్రి కూతలు!

23 Aug, 2019 14:57 IST|Sakshi

బ్రెజిల్‌ అధ్యక్షుడిపై నెటిజన్ల మండిపాటు

రియోడిజెనిరో : కార్చిచ్చుతో గత కొన్ని రోజులుగా అమెజాన్‌ అడవి తగులబడిపోతోంది. వేలాది ఎకరాల్లో అడవులు బుగ్గి పాలవడంతో పర్యావరణంపై దుష్ప్రభావం చూపిస్తోంది. అక్కడంతా దట్టమైన పొగ కమ్మేయడంతో చీకటిమయమైంది. లక్షలాది చెట్లు దహనం కావడంతో భారీ స్థాయిలో కార్బన్‌వాయువు వాతావరణంలోకి విడుదల అవుతోంది. మొత్తం అమెజాన్‌ పరివాహకం 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు నెలవు. దాదాపు పది లక్షల మంది ఆదిమవాసులు ఈ అడవుల్లో నివసిస్తున్నారు. భూతాపాన్ని నియంత్రించడానికి, ప్రపంచానికి ఆక్సిజన్‌ అందించడానికి ఈ ప్రాంతం చాలా కీలకమైంది. కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను ఈ అడవులు పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. 

చదవండి: మంటల్లో ‘అమెజాన్‌’; విరాళాలు ఇవ్వండి!

ఉత్తర ప్రాంత రాష్ట్రాల్లో ఈ మంటల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 74 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న అమెజాన్ బేసిన్‌ ప్రధానంగా బ్రెజిల్‌లో ఉంది. దీంతో బ్రెజిల్‌లో అతి పెద్ద రాష్ట్రమైన అమెజానాస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నెల 14న బ్రెజిల్‌లోని ట్రాన్స్‌-అమెజానియా హైవేలో కొన్ని మీటర్ల విస్తీర్ణంలో మొదలైన ఈ మంటలు వారం రోజుల వ్యవధిలోనే  ఇతర ప్రాంతాలకు వ్యాపించి ప్రస్తుతం అదుపు చేయలేనంతగా విస్తరించడంతో బ్రెజిల్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ఓ వివాదాస్పద ప్రకటన చేశాడు. పర్యావరణం కోసం పాటుపడే ఎన్‌జీవోల వల్లే ఈ మంటలు చెలరేగాయని ఆరోపించారు. ఎన్‌జీవోలకు విరాళాలు తగ్గడంతో తన ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ఇలా చేశారని అన్నారు. బోల్సొనారో వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అమెజాన్‌ కోసం ప్రార్థించండి అంటూ సోషల్‌మీడియా ద్వారా ఉద్యమం చేస్తూ బోల్సొనారోపై దుమ్మెత్తిపోస్తున్నారు.

మరిన్ని వార్తలు