కోవిడ్‌-19 ఎఫెక్ట్‌: పిల్లులకూ మాస్క్‌!

17 Feb, 2020 18:38 IST|Sakshi

బీజింగ్‌ : ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) ఎఫెక్ట్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. శుభ్రతపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారంతా సానిటైజర్లు, ఫేస్‌ మాస్క్‌లు, హ్యాండ్‌ వాష్‌లంటూ శుభ్రత పాటిస్తున్నారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచ ప్రజలంతా తగిన శుభ్రత పాటిస్తూ అప్రమత్తమవుతున్నారు. ఇక చైనా ప్రజల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలు ఇంట్లోనుంచి కాలు బయటపెట్టేందుకే జంకుతున్నారు. ఎప్పుడూ జనసంద్రంగా ఉండే వుహాన్‌ రోడ్లు నిర్మానుషంగా మారాయి. ఒకవేళ బయటకు రావల్సి వస్తే ఫేస్‌ మాస్క్‌లు తప్పనిసరి.. లేదంటే జైలు పాలు కావల్సిందే. ఇక ప్రజలే కాదు అక్కడి పిల్లులు, కుక్కలు సైతం ఫేస్‌ మాస్క్‌లు లేనిదే బయటకు రావడం లేదు. ఓ పెంపుడు పిల్లి ఫేస్‌ మాస్క్‌తో రోడ్లపై తిరుగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలకు ఇప్పటి వరకూ వేలల్లో లైక్‌లు రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఇప్పటికీ పిల్లులను ప్రేమిస్తున్నారు’ అని ‘మనం ప్రేమించే వారిని రక్షించుకోవడం మన బాధ్యత’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా కరోనా వైరస్‌ మంసాహారం తింటే వస్తుందని, జంతువుల నుంచి వస్తున్నాయంటు పుకార్లు పుట్టడంతో చైనా ప్రజలు మాంసహారం తినడమే మానేస్తున్నారు. అలా వుహాన్‌ ప్రజలు ఈ ప్రాణాంతక వైరస్‌ నుంచి తమని తమను రక్షించుకుంటూ.. వారి పెంపుడు జంతువులను కూడా సంరక్షిం‍చుకుంటున్నారు. ఇందు కోసం వారి పెంపుడు పిల్లులు, కుక్కలకు మనుషుల ఫేస్‌ మాస్క్‌లు వేస్తున్నారు. మాస్క్‌కు వాటి కళ్ల దగ్గర రంధ్రలు చేసి వాటికి తొడుగుతున్నారు. దీంతో అక్కడ మాస్క్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఒకనొక సమయంలో మాస్క్‌లు దొరకడం కూడా కష్టతరంగా మారుతోంది. ఇక ఈ కరోనా వైరస్‌ ఎలా సోకుంతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. దీనికి మందును కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 17 వందలకుపైగా మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. (చదవండి: ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!)

మరిన్ని వార్తలు