‘చివరి బహుమతి.. జాగ్రత్తగా చూసుకుంటా’

13 Jun, 2020 16:02 IST|Sakshi

రెండో బిడ్డకు జన్మనిచ్చిన వుహాన్‌ వైద్యుడు‌ లీ వెన్లియాంగ్‌‌ భార్య

బీజింగ్‌: ప్రపంచాన్ని కలవర పెడుతున్న మహమ్మారి కరోనా వైరస్‌ గురించి ముందుగానే హెచ్చరించి.. చివరకు దాని‌కే బలయిన కళ్ల డాక్టర్‌ లీ వెన్లియాంగ్‌ భార్య వారి రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. చైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వీచాట్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నువ్వు నాకిచ్చిన చివరి బహుమతి ఈ రోజు ప్రాణం పోసుకుంది. ఈ బహుమతిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. స్వర్గం నుంచి నువ్వు దీన్ని చూస్తున్నావా’ అంటూ రాసుకొచ్చింది. ఈ మెసేజ్‌తో తమ రెండో సంతానం అయిన పిల్లవాడి ఫోటోను కూడా  ఆమె షేర్‌ చేశారు. 

వుహాన్‌ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడు స్థానిక వైద్యుడైన వెన్లియాంగ్ సహచరులను దీని గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబర్‌లో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్‌తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్‌కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందిందే. దాంతో తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబర్ 30న ఆయన మెసేజ్‌ పెట్టారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని పోలీసులు ఆయనను హెచ్చరించారు. చివరకు లీ వెన్లియాంగ్‌ కూడా కరోనా వైరస్‌తో ఫిబ్రవరిలో మరణించారు.

>
మరిన్ని వార్తలు