చైనా కీలక నిర్ణయం.. ఫుల్‌ పవర్‌ ఆయనకే..

25 Feb, 2018 19:48 IST|Sakshi

బీజింగ్‌ : చైనా అనూహ్య నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఆ దేశానికి అధ్యక్షుడుగా పనిచేస్తున్న జీ జిన్‌పింగ్‌ను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ ఆ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయబోతోంది. ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడుగా కొనసాగాలనే నిబంధనను తొలగించాలని చైనా రూలింగ్‌ కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినట్లు కీలక వర్గాల సమాచారం. 64 ఏళ్ల వయసున్న జీ జిన్‌పింగ్‌ తమ దేశ రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు ఐదేళ్లపాటు పనిచేసిన తర్వాత దిగిపోవాలి.

అయితే, ఇప్పటికే ఒక దఫాను పూర్తి చేసుకున్న ఆయనను రెండోసారి ఎన్నుకునేందుకు మార్చి 5న పార్లమెంటు సమావేశం కానుంది. ఇప్పటికే ఆయన పార్టీ, మిలిటరీ చీఫ్‌గా నిరవధికంగా కొనసాగుతున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిరవధికంగా కొనసాగేలా పార్టీ కేంద్ర కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసి చైనా అధికార మీడియా జినువా వెల్లడించింది. కాగా, చైనా ఆదర్శాలతో కూడిన సోషలిజంపై జీ జిన్‌పింగ్ ఆలోచనలను రాజ్యాంగంలో చేర్చాలనీ కూడా కేంద్ర కమిటీ ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ మేరకు చేసిన రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అయితే, చైనా పార్లమెంట్‌లో ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అందులో ఉన్నవారంతా కూడా పార్టీ విధేయులే.

మరిన్ని వార్తలు