ఆ పిశాచి ఎక్కడ దాక్కున్నా వదలం : చైనా అధ్యక్షుడు

29 Jan, 2020 10:40 IST|Sakshi

వుహాన్‌ : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన సంగతి తెలిసిందే.  చైనాలో ఇప్పటి వరకు 131 మంది మృత్యువాత పడగా, 4,515 మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. కాగా మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌  చైనాలో విస్తరించిన కరోనా వైరస్‌ను ఒక పిశాచితో పోల్చారు. కరోనా అనే పిశాచి మా దేశంలోకి చొరబడి వందల మంది ప్రాణాలను బలితీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలో కరోనా వైరస్‌ మా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీనిని నియంత్రణలోకి తెచ్చేందుకే ఆరోగ్య సంస్థ జనరల్‌ డైరెక్టర్‌తో భేటీ అయినట్లు జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు.

'ఈ కరోనా వైరస్‌ ఒక పిశాచి లాంటిది. ఈ అంటువ్యాది ఎక్కడ దాక్కున్నా మేం వదలిపెట్టం అని' జిన్‌పింగ్‌ ప్రతిజ్ఞ చేశారు.  టెడ్రోస్ అధనామ్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ సోకిన వుహాన్ నగరం నుంచి వివిధ దేశాల పౌరులను తరలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించలేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని కోరారు. కరోనా వైరస్‌కు సంబంధించి అన్ని విషయాలు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపామని టెడ్రోస్‌ వెల్లడించారు. మరోవైపు చైనాలో మొదలైన కరోనా వైరస్‌ మెళ్లిగా ఇతర దేశాలకు పాకింది. ఇప్పటివరకు థయ్‌లాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, వియత్నాం, సింగపూర్‌, మలేషియా, నేపాల్, శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి.
(బాబోయ్‌ కరోనా)

(కరోనా వైరస్‌తో 6.5 కోట్ల మందికి ముప్పు!)

మరిన్ని వార్తలు