ఒక్క రోజు కోసం రాణిగారికి రూ.26లక్షల టాయిలెట్

22 Feb, 2016 14:20 IST|Sakshi
ఒక్క రోజు కోసం రాణిగారికి రూ.26లక్షల టాయిలెట్

కాంబోడియా: ఆమె కూడా అందరిలాంటి మనిషే. కాకపోతే రాణి హోదాలో ఉంది. ఆమె తమ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు మర్యాదలు చేయడమనేది చాలా మంచి సంప్రదాయమే అవుతుంది. అలాగని సౌకర్యాల పేరిట లక్షల రూపాయలు చిన్నచిన్న విషయాలకు కూడా విసిరిపారేస్తే సామాన్యులకు కూడా ఆగ్రహం తెప్పిస్తుంది. ఇక ఆకలితో అలమటించే ప్రాంతంలో ఇలాంటి పనిచేస్తే ప్రభుత్వంపై ప్రజానీకం భగ్గుమంటుంది. ప్రస్తుతం కాంబోడియాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. తమ ప్రభుత్వం చేసిన నిర్వాకం తెలిసి అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. థాయిలాండ్ రాణి మహా చక్రి సిరింధోర్న్ కాంబోడియాలోని అత్యంత పేద ప్రాంతమైన రతన క్కిరి ప్రావిన్స్ పర్యటనకు వస్తున్నారు. ఆమె మూడు రోజులపాటు ఆ ప్రాంతంలో గడపనున్నారు. అయితే, ఆమె పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఆడంబరాలకు పోయి సాధరణంగా ఖర్చు చేసే మొత్తం కన్నా 130 రెట్ల సొమ్ముతో ఓ విలాసవంతమైన మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది. అది కూడా ఆ ప్రాంత ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి ఇయాక్ లామ్ సరస్సు ఒడ్డున.

సుమారుగా రూ.27లక్షలకు పైగా(40 వేల డాలర్లు) ఖర్చు చేసి మరి సర్వాంగ సుందరంగా టాయిలెట్ ను తీర్చిదిద్దారు. వాస్తవానికి ఆమె ఆ ప్రాంతంలో మూడు రోజులపాటు పర్యటించినా ఆ టాయిలెట్ నిర్మించిన ప్రాంతంలో ఉండేది ఒకటే రోజు. అంటే ఒకటే రోజు దానిని ఉపయోగించుకుంటారన్నమాట. ఆ తర్వాత తిరిగి దానిని కూల్చివేస్తారంట.

అందులోని ప్రధాన వస్తువులు తిరిగి థాయిలాండ్ పంపిస్తారట. రాణిగారి పర్యటన నేపథ్యంలో బ్యాంకాక్ నుంచి ప్రత్యేకంగా ఈ సామాగ్రిని కాంబోడియా ప్రభుత్వం తెప్పించి నిర్మించింది. అయితే, మరికొంతమంది మాత్రం రాణి వెళ్లిపోయిన తర్వాత దానిని ఆఫీసుగా మారుస్తారని చెప్తున్నారు. ఏదేమైనా రాణిగారి కోసం నిర్మించిన ఈ టాయిలెట్ మరోసారి సామాన్యుడికి తాను ఎప్పటికీ సామాన్యుడే అనే విషయం మాత్రం గుర్తు చేసింది.

మరిన్ని వార్తలు