'నా కథే బాధగా ఉంటే.. నాలాగా ఇంకెందరో..'

16 Feb, 2016 17:21 IST|Sakshi
'నా కథే బాధగా ఉంటే.. నాలాగా ఇంకెందరో..'

లండన్: ఒక్కసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతిలోపడితే వారు చూపించే నరకం అంతా ఇంతా కాదని యాజిది వర్గానికి చెందిన నదియా మురాద్ (21) అనే యువతి తెలిపింది. కొన్ని నెలల కిందట వారి చెరలో ఇరుక్కుని ఏదో ఒకలా బయటపడిన ఆమె ప్రస్తుతం ఐసిస్కు వ్యతిరేకంగా వారి బారిన పడిన మహిళలందరినీ ఏకం చేస్తోంది. లండన్లోని ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ హౌస్లో ఆమె మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని, ఉగ్రవాదుల చెరలో పలు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.

'నేను మాట్లాడేది నా ఒక్కదాని తరుఫున కాదు.. ఇరాక్ యుద్ధ క్షేత్రంలో ఇస్లామిక్ స్టేట్ చేతుల్లో ఇరుక్కుపోయిన అన్ని కుటుంబాలు, మహిళలు, చిన్నారుల తరుపున మాట్లాడుతున్నాను. యాజిదీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా నేను ప్రచారం ప్రారంభించి రెండు నెలలు పూర్తయింది. 5,800మంది యాజిదీ మహిళలను, చిన్నారులను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. వారిలో ఎంతోమందిని చంపేశారు. చాలాకుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేశారు. మా యాజిదీల్లో ఉగ్రవాదుల పురుషులను హత్య చేస్తారు. స్త్రీలను ఎత్తుకెళతారు. ఎత్తుకెళ్లిన తర్వాత హత్య  చేయొచ్చు అత్యాచారం చేయవచ్చు.. వారి ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేయొచ్చు. ఇస్లాం పేరుమీద వారు ఎప్పుడు ఏం చేస్తారో ఊహించలేం. నా కుటుంబంలోనే ఆరుగురుని హత్య చేశారు. నా సోదరులను చంపేశారు. నా సోదరులను చంపుతుంటే మా అమ్మ చూసిందని ఆమెను చంపేశారు. నన్ను మోసుల్ కు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ సమయంలో నేను నా తల్లిని, సోదరులను మరిచిపోయాను. ఎందుకంటే ఓ మహిళపట్ల ఉగ్రవాదులు ఆ సమయంలో ప్రవర్తించే తీరు చావుకంటే భయంకరంగా ఉంటుంది. కొందరికీ నా ఈ కథే బాధకరంగా ఉండొచ్చు. కానీ నాకంటే కూడా బాధకరమైన కథలు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో 3,400మంది మహిళలు ఉన్నారు. ఏడాదిన్నరగా మాపై ఈ హత్యాకాండ ఆగడం లేదు' అని ఆమె వాపోయింది. ప్రపంచ దేశాలు తమకు సహాయం చేయాలని కోరింది. 

మరిన్ని వార్తలు