అబార్షన్ల కోసం ‘యెస్‌’ క్యాంపెయిన్‌..

19 May, 2018 10:36 IST|Sakshi
సవితా హలప్పనావర్‌ (పాత ఫొటో)

డబ్లిన్‌ : సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఐర్లాండ్‌లో మరణించిన ​​​​​​​​​భారత సంతతి దంత వైద్యురాలు సవితా హలప్పనావర్‌ ఫొటో ప్రస్తుతం ఐర్లాండ్‌ పత్రికల పతాక శీర్షికల్లో దర్శనమిస్తోంది. ఆమె మరణం ఎంతో మంది మహిళలను కదిలించింది... యెస్‌ క్యాంపెయిన్‌ పేరిట జరుగతున్న ఉద్యమానికి చిరునామాగా మారింది. ఎందుకంటే ఆమె ఏ రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనో మరే ఇతర కారణాల వల్లో మరణించలేదు... అక్కడి కఠినమైన చట్టాలు ఆమెను బలవంతంగా హత్య చేశాయి.

యెస్‌ క్యాంపెయిన్‌...
క్యాథలిక్‌ దేశంగా పేరున్న ఐర్లాండ్‌.. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతించి, చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ప్రసిద్థికెక్కింది. అదే విధంగా మైనారిటీ వర్గానికి చెందిన గేను ప్రధానిగా ఎన్నుకుని  ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు చేస్తున్న ఐరిష్‌ ప్రభుత్వం మహిళల విషయంలో మాత్రం కఠినంగానే వ్యవహరిస్తోంది. క్యాథలిక్‌ దేశానికి చెందిన మహిళలనే కారణాన్ని చూపి అబార్షన్లకు అనుమతివ్వకుండా.. ఎంతో మంది మహిళల మరణాలకు కారణమవుతోంది.

అయితే ఆరేళ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావానికి అనుమతివ్వాలంటూ సవిత ఐరిష్‌ ప్రభుత్వాన్ని కోరింది. కానీ అందుకు వారు నిరాకరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో సంచలనం సృష్టించిన సవిత మరణం.. గర్భస్రావాల వ్యతిరేక​ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఐరిష్‌ మహిళల్లోని పోరాట పటిమను మరింత దృఢపరిచింది. యెస్‌ క్యాంపెయిన్‌ పేరిట అబార్షన్ల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ఊపిరులూదింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల(మే) 25న నిర్వహిస్తున్న రెఫరెండంలో ఓటు వేసేందుకు బ్రిటన్‌, ఇతర దేశాల్లో స్థిరపడిన మహిళలు కూడా రాబోతున్నారు.

ఆ నిషేధం ఎత్తివేయాలి...
ఐర్లాండ్‌ రాజ్యాంగంలోని ఎనిమిదో అధికరణకు సవరణ చేయాలన్నదే యెస్‌ క్యాంపెయిన్‌ ముఖ్య ఉద్దేశం. ఈ అధికరణ ప్రకారం గర్భస్థ శిశువుల జీవించే హక్కు పేరిట ఐర్లాండ్‌ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఎంతో మంది మహిళలు అబార్షన్ల కోసం ఇంగ్లండ్‌, ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లలేని స్తోమత లేనివారు మరణిస్తున్నారు. అయితే సవిత కేసు పత్రికల్లో ప్రముఖంగా ప్రచారమవడంతో అబార్షన్లపై ఉన్న నిషేధ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయాలంటూ ఐరిష్‌ మహిళలు ముందుకొచ్చారు. అమె ఫొటోతో క్యాంపెయిన్‌ నిర్వహిస్తూ తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.

అసలేం జరిగింది...?
భారత సంతతికి చెందిన సవితా హలప్పనావర్‌ ఐర్లాండ్‌లో దంత వైద్యురాలిగా పనిచేసేవారు. 17 వారాల గర్భవతైన సవిత.. నడుము నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారు. గర్భస్రావం కావడంతో వెంటనే అబార్షన్‌ చేసి పిండాన్ని తొలగించాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కానీ ఐర్లాండ్‌ చట్టాల ప్రకారం అబార్షన్‌ చేయడం నేరం. దీంతో వారం రోజుల అనంతరం తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల కారణంగా సవిత మరణించింది.

సంతోషంగా ఉంది : సవిత తండ్రి
ఆరేళ్ల క్రితం మరణించిన తన కూతురును, ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తుపెట్టుకున్న ఐరిష్‌ మహిళలకు సవిత తండ్రి కృతఙ్ఞతలు తెలిపారు. తన కూతురి ఫొటోను యెస్‌ క్యాంపెయిన్‌కు వాడుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఒకవేళ ఐరిష్‌ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఎంతో మంది మహిళల చిరునవ్వుల్లో తన కూతురు బతికే ఉంటుందంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మే 25న నిర్వహించబోతున్న ఓటింగ్‌లో ఐరిష్‌ మహిళలంతా పాల్గొనాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు