కంటిచూపుతో... పంపేయొచ్చు!

28 Sep, 2016 02:27 IST|Sakshi
కంటిచూపుతో... పంపేయొచ్చు!

స్మార్ట్‌ఫోన్‌తో ఒక చేత్తో ఫొటో/వీడియో క్లిక్ మనిపించడం... ఇంకోచేత్తో ఠకీమని వాటిని సోషల్ వెబ్‌సైట్లలోకి ఎక్కించేయడం... ఇదీ ఈకాలపు యువత ట్రెండ్. వీరి పని మరింత సులువు చేసేందుకా అన్నట్టు ఇన్‌స్టంట్ వీడియో మెసేజింగ్ ఆప్ ‘స్నాప్‌ఛాట్’ ఇదిగో.. ఈ కళ్లద్దాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏంటి దీనివల్ల ప్రయోజనమనుకుంటే... వీటిని ధరించిన అమ్మాయి చూపుడు వేలు ఎక్కడుందో చూడండి... అలాగే ఈ కళ్లజోడుకు ఇరువైపులా ఉన్న కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌లపై ఓ లుక్కేయండి. అదీ విషయం.

ఫ్రేమ్‌పై ఉన్న చిన్న మీటను నొక్కగానే ఎల్‌ఈడీ ఫ్లాష్ వెలుగుతుంది. అదే సమయంలో కెమెరా 10 సెకన్ల వీడియోను రికార్డు చేస్తుంది. కామెంట్స్ జత చేసి వెంటనే దీన్ని స్నాప్‌ఛాట్‌లోకి ఎక్కించేయవచ్చునన్నమాట. అలాగని ఇదేదో ఆషామాషీగా వీడియో తీయదండోయ్. ‘స్పెక్టకల్స్’ పేరుతో విడుదలైన ఈ కళ్లజోడు ఏకంగా రెండువైపులా 115 డిగ్రీల వరకూ వీడియో తీయగలదు. మూడు రంగుల్లో లభిస్తున్న ఈ సరికొత్త కళ్లజోడు ధర 129 డాలర్ల వరకూ ఉంటుంది.

మరిన్ని వార్తలు