ఎండలోకి వెళ్లకుంటే.. ముందరే మృత్యుగంట..

14 Jun, 2014 00:18 IST|Sakshi

వాషింగ్టన్: ఎండ ముఖం చూడకుండా ఆఫీసులకో, ఇంటికో పరిమితమయ్యే వారు తొందరగా మృత్యుముఖాన్ని చూడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మి ద్వారా మన శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. శరీరంలో ఆ విటమిన్ తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా ఉన్న వారి కంటే రెండు రెట్ల ప్రమాదం పొంచి ఉందని, తక్కువగా ఉన్న వారు ముందస్తుగా చనిపోయే అవకాశాలు ఎక్కువ అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ సెడ్రిక్ గార్లాండ్ హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి లోపిస్తే చాలా ప్రమాదమని మూడేళ్ల కిందటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్(ఐఓఎం), అమెరికా జాతీయ సైన్స్ అకాడమీ చెప్పాయని ఆయన తెలిపారు.

ఒక మిల్లీలీటర్ రక్తంలో 20 నానో గ్రాముల కంటే విటమిన్ డి తక్కువ ఉంటే అది ఆ విటమిన్ లోపంగానే పరిగణిస్తారని, దాంతో ఎముకల సంబంధిత వ్యాధులు వస్తాయని గతంలో ఐఓఎం తెలిపిందన్నారు. అయితే తమ పరిశోధనల్లో ఒక్క ఎముకల వ్యాధే కాకుండా.. అది ఆ వ్యక్తి ముందస్తు మరణానికి కూడా దారితీస్తుందని గార్లాండ్ చెబుతున్నారు. 14 దేశాల్లో తొమ్మిదేళ్ల పాటు 50 లక్షల మందికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించామని చెప్పారు. 30 నానో గ్రాముల కన్నా ఎక్కువ ఉన్న వారు ఈ ప్రమాదానికి దూరంగా ఉన్నట్లేనని ఆయన వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు