విమానాల్లో ప్రయాణ‌మా? ఈ రూల్స్ త‌ప్ప‌నిస‌రి

4 Jul, 2020 15:44 IST|Sakshi

వాషింగ్ట‌న్ : అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా కేసుల విష‌యంలో, మ‌ర‌ణాలు రేటులోనూ ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా నిలిచింది. అయిన‌ప్ప‌టికీ విమానా ప్ర‌యాణాలు చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో దేశంలో విమానాల ద్వారా ప్ర‌యాణాలు చేసిన వారి సంఖ్య పెరిగింద‌ని ట్రాన్స్‌పోర్టేష‌న్ సెక్యూరిటీ అడ్మినిస్ర్టేష‌న్ నివేదించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికులంద‌రూ క‌చ్ఛితంగా ముక్కు, నోరు క‌వ‌ర్ అయ్యేలా ఫేస్ మాస్క్ ధ‌రించాల‌ని ప‌లు విమాన‌యాన సంస్థలు ఇప్ప‌టికే నిబంధ‌న‌లు  జారీ చేశాయి. లేని ప‌క్షంలో ప్ర‌యాణికుల‌పై తాత్కిలిక నిషేధం విధించేలా ప‌లు సంస్థ‌లు చ‌ర్య‌ల‌కు పూనుకున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేయాల‌నుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా ఈ నిబంధ‌న‌లు పాటించాల్సిందే అని ప‌లు అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్ నిబంధ‌న‌ల్లో పేర్కొన్నాయి. (కరోనా : 7500 ఉద్యోగాల కోత )

 అల‌స్కా ఎయిర్ లైన్స్
క‌స్ట‌మ‌ర్లు, ఉద్యోగులు స‌హా ప్రయాణికులంద‌రూ కచ్ఛితంగా వారి ముక్కు, నోరు క‌వ‌ర్ అయ్యేలా మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని అల‌స్కా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అంతేకాకుండా అద‌నంగా మాస్క్ కావాల‌నుకునే వారికి కూడా ఎయిర్‌లైన్స్‌లోనే ఇచ్చే వెసులుబాటు ఉంది. తినేట‌ప్పుడు, తాగేట‌ప్పుడు మాత్రం మాస్క్ తీసేయోచ్చ‌ని పేర్కొంది. రెండు సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌లు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, అంగ వైక‌ల్యం ఉన్న‌వారికి  సైతం మాస్క్ ధ‌రించాల‌న్న నిబంధ‌న నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు. జూన్ 30న అల‌స్కా ఎయిర్‌లైన్స్ రెండు పాల‌సీల‌ను తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా చెక్-ఇన్ ద‌గ్గ‌రే హెల్త్ ఆరోగ్య ఒప్పందం ( హెల్త్ అగ్రిమెంట్ )పై సంత‌కం చేయాల్సి ఉంటుంది. అందులో ఎయిర్‌లైన్స్ సూచించిన నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రిస్తామ‌ని సంత‌కం చేయాలి. ఒక‌వేళ ఎవ‌రైనా ప‌దేప‌దే దీన్ని విస్మ‌రిస్తే వారికి యెల్లో కార్డు చూపిస్తారు. త‌ద్వారా భ‌విష్య‌త్తులో వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తార్న‌మాట‌. 

 అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్
మాస్క్ ధ‌రించ‌క‌పోతే బోర్డింగ్ వ‌ద్దే నిలిపివేస్తాం అంటుంది అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్. ప్ర‌యాణం మొత్తం వర‌కు మాస్క్ ధ‌రించాల్సిందే. అయితే తినేప‌ట‌ప్ప‌డు లేదా తాగేట‌ప్పుడు మాత్రం మాస్క్ తీసేయొచ్చు. చిన్న‌పిల్ల‌లు, దివ్యాంగుల‌కు సైతం దీని నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు. మిగ‌తా ప్ర‌యాణికులంద‌రూ ప్ర‌ముఖులైనా స‌రే మాస్క్ ధ‌రించాల్సిందే అని పేర్కొంది. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘిస్తే స‌ద‌రు ప్ర‌యాణికుల‌పై ట్రావెల్ బ్యాన్ విధిస్తారు. మాస్క్ ధ‌రించేందుకు నిరాక‌రించిన క‌న్స‌ర్వేటివ్ పార్టీ నేత‌ను జూన్ 17న న్యూయార్క్‌లో  విమానం ఎక్క‌కుండా అడ్డ‌కున్నారు. నిబంధ‌నలు అంద‌రికీ స‌మాన‌మే అని సంస్థ పేర్కొంది. 

డెల్టా ఎయిర్‌లైన్స్‌
లాబీ పాయింట్‌లో చెకింగ్ ద‌గ్గ‌రినుంచి ప్ర‌యాణం ముగిసే వ‌ర‌కు మాస్క్ ధ‌రించాల‌ని డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్క్ ద‌రించాలని అయితే భోజ‌న స‌మ‌యంలో మాత్రం తీసేయోచ్చ‌ని పేర్కొంది. ఒక‌వేళ మాస్క్ కావాల‌న్నా ఎయిర్‌లైన్స్‌లోనే క‌ల్పిస్తారు. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లున్న‌వారికి మాత్రం మాస్క్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు. 

ఫ్రాంటియ‌ర్ ఎయిర్‌లైన్స్
మాస్క్ లేనిదే ప్ర‌యాణానికి అనుమ‌తించ‌రు. ఆరోగ్య స‌మ‌స్యలున్న చిన్న పిల్ల‌ల‌కు మాత్రం మిన‌హాయింపు క‌ల్పించారు. అంతేకాకుండా సొంతంగా మాస్క్ త‌యారుచేసే విధానాన్ని త‌మ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆస‌క్తి ఉన్న‌వాళ్లు స్వ‌యంగా మాస్క్ త‌యారుచేసుకోవ‌చ్చు. 

 జెట్ బ్లూ ఎయిర్‌లైన్స్
ప్రయాణికులూ సిబ్బందితో స‌హా మాస్క్ ధ‌రించాల‌ని ఆదేశించిన మొద‌టి విమానయాన సంస్థ జెట్ బ్లూ. చెక్‌-ఇన్ మెద‌లుకొని ప్ర‌యాణం ముగిసే వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాలి. తినేప‌టప్పుడు లేదా తాగేట‌ప్పుడు మాస్క్ తీసేయోచ్చు. చిన్నపిల్ల‌లు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లున్న‌వారికి ఈ నిబంధ‌న నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు. ఎవ‌రైనా మాస్క్ ధ‌రించేందుకు ఎవ‌రైనా నిర‌కారిస్తే వారిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌, స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమాన‌యాన సంస్థ‌లు సైతం క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా మాస్క్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను త‌ప్ప‌నిస‌రి చేశాయి. ప్ర‌యాణికులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా నోరు, ముక్కు క‌వ‌ర్ అయ్యేలా మాస్క్ ధ‌రించాల‌ని పేర్కొన్నాయి. ఎవ‌రైనా ఈ నిబంధ‌ల‌న్ని ఉల్లంఘిస్తే వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తామని తెలిపాయి. (దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు )

మరిన్ని వార్తలు