అయినవాళ్లు రోడ్డున పడేస్తే...

18 Feb, 2016 14:19 IST|Sakshi
అయినవాళ్లు రోడ్డున పడేస్తే...

నైజీరియాలో మంత్రగాడి పేరుతో బహిష్కరణకు గురైన పసివాడిని  ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఆఫ్రికాలో  అనాథ బాలల కోసం  స్వచ్ఛంద సంస్థ  స్థాపించిన అంజా రింగ్రెన్ లోవెన్ ఎంతో కష్టపడి మరీ ఆ పిల్లాడిని వెదికి పట్టుకుంది.  అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ బాలుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఎముకల గూడులా  మారి, నిస్సహాయంగా దొరికిన చిన్నారి మొఖంలో నవ్వులు  పూయించింది.
 
వివరాల్లోకి వెళితే  నైజీరియాలో మంత్రగాడు అనే  నెపంతో ఓ పసి బాలుడిని కుటుంబసభ్యులు రోడ్డున పడేశారు.  సుమారు   ఏడాదిన్నర వయసు ఉన్న   ఆ పిల్లాడిని ఆకలితో మాడ్చి చంపేయాలని అలా మూర్ఖంగా వదిలేశారు. చంటి బిడ్డ అలా రోడ్డున తిరుగుతున్నా... ఏ ఒక్కరూ జాలి పడలేదు. సరికదా మంత్రగాడంటూ దుర్భాష లాడుతూ, అమానుషంగా ప్రవర్తించారు.  అలా ఎనిమిది నెలల నుంచి నడిరోడ్డుపై జీవనం సాగించిన ఆ చిన్నారి అష్టకష్టాలు పడ్డాడు. కడుపు నింపుకోవడం కోసం రోడ్డు మీద ఏది పడితే అది తిన్నాడు. ఫలితంగా కడుపంతా నులి పురుగులు పట్టాయి. రక్త ప్రసరణ  సన్నగిల్లింది.  ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయి శరీరమంతా విషమయంగా మారిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న లోవెన్ ఆ పిల్లాడిని వెతికి పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టి చివరికి సాధించింది.   చిక్కి శల్యమై ఎముగల గూడులా మారిన  ఆ చిన్నారిని చేరదీసి 'హోప్' అని  పేరు పెట్టింది.  సపర్యలు చేసి స్నానం చేయించి... ఆసుపత్రిలో చేర్చింది.  దీంతోపాటుగా బాలుడి సహాయార్ధం  లోవెన్ సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్థిక సాయాన్ని అర్ధించింది.  దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. రెండు రోజుల్లో ... పదిలక్షల డాలర్లు సమకూరాయి.  'ఇపుడు హోప్ నవ్వుతున్నాడు.. తనకు తానుగా కూర్చుంటున్నాడు. నా కొడుకుతో ఆడుకుంటున్నాడంటూ' లోవెన్ తన సంతోషాన్ని ఫేస్బుక్ ద్వారా  పంచుకుది.

కాగా  'ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ పౌండేషన్ ' అనే సంస్థను స్థాపించిన లోవన్ గత  మూడేళ్లుగా తన సేవలందిస్తోంది. భర్త డేవిడ్ ఇమ్మానుయేల్ ఆమెకు పూర్తిగా అండగా ఉన్నారు.  2016, జనవరి 29న ఆ బాలుడి ఆచూకీ  కనుక్కొని లోవెల్ చేరదీసింది. ఆ రోజు నుంచి  అతడిని కంటికి రెప్పలా కాపాడింది.  అప్పటి నుంచి ఇప్పటివరకు హోప్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడినట్టు లోవెన్ ఫేస్ బుక్ ద్వారా తెలిపింది.  తనంతట తాను ఆహారం తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది. కాగా  ఆఫ్రికా దేశాల్లో చాలాచోట్ల ఇలాంటి అనాగరిక అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.  వేలాదిమంది హోప్ లాంటి పిల్లలు  వీధి పాలవుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు