'స్వచ్ఛ నగరం' కోసం హత్యలు

25 Feb, 2015 15:11 IST|Sakshi
'స్వచ్ఛ నగరం' కోసం హత్యలు

మాస్కో: ప్రపంచంలో వరుస హత్యలకు పాల్పడే ఉన్మాదుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత కారణాల వల్లనే ఉన్మాదులుగా మారుతారు. ఇలాంటి వరుస హత్యలకు పాల్పడ్డ ఓ రష్యా దంపతులు ఎందుకు ఆ హత్యలకు పాల్పడ్డారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కూడు గూడులేక ఫుట్‌పాతులు, పబ్లిక్ పార్కుల్లో తలదాచుకున్నవారు, పీకలదాకా తాగేసి దారితెన్ను తెలియక ఫుట్ పాతులపై పడిపోయిన మందుబాబులను లక్ష్యంగా చేసుకొని వారు హత్యలకు పాల్పడ్డారు. అనాథలు, అభాగ్యులులేని, తాగుబోతులు కనిపించని 'స్వచ్ఛ' మాస్కో నగరాన్ని స్థాపించడమే వారి లక్ష్యమట.

గతేడాది జూలై నెల నుంచి ఈ ఫిబ్రవరి నెల వరకు 12 హత్యలు చేసి చివరకు దొరికిపోయారు.  20 ఏళ్ల పాల్ వయితోవ్, 25 ఏళ్ల ఎలేనా లొబచేవ అనే దంపతులు ఈ దారుణాలకు  తెగబడ్డారు. హత్యలకు వారు ఎంపిక చేసుకొన్న ఆయుధాలు రకరకాల కత్తులు. రాత్రిపూట జన సంచారం ఎక్కువలేని సమయాల్లో వారు ఫుట్‌పాత్‌లు, పబ్లిక్ పార్కుల్లో సంచరిస్తూ వారు హత్యలకు పాల్పడ్డారు. సెర్గీ యెవ్‌శ్చెవ్ అనే బ్యాంకు ఉద్యోగిని 107 సార్లు కత్తులతో కర్కశంగా కసాకసా పొడిచి హత్య చేశారు.

దిక్కూ మొక్కులేని దీనుల హత్యలు జరిగినప్పుడు పెద్దగా పట్టించుకోని మాస్కో పోలీసులు బ్యాంకు ఉద్యోగి హత్య సంచలనం సృష్టించడంతో పరుగులుతీసి మరీ హంతక దంపతులను అరెస్టు చేశారు. పాపం బ్యాంకు ఉద్యోగి ఫుట్‌పాతర్ కాకపోవడమే కాకుండా తాగుబోతు కూడా కాదట. ఓ స్నేహితుడిని కలవడం కోసం పబ్లిక్ పార్కులో నిరీక్షిస్తుండగా హంతక దంపతులు దాడిచేసి దారుణంగా హత్య చేశారు. తాము భావించిన విధంగా  మాస్కో నగరాన్ని ప్రక్షాళించాలనే తిక్కాలోచనతో వరుస హత్యలకు పాల్పడిన ఆ రష్యా దంపతులు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు.

మరిన్ని వార్తలు