పేదల పొరుగున పెరిగితే...

15 Mar, 2016 20:20 IST|Sakshi
పేదల పొరుగున పెరిగితే...

పేదరికం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో, ఆర్థికంగా వెనుకబడినవారు నివసించే ప్రాంతాల్లో ఉండే యువతుల్లో ఊబకాయ సమస్య అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు  తాజా అధ్యయనాల్లో తేలింది. పేదరికం, ఊబకాయానికి మధ్య పాక్షిక సంబంధం ఉండే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. తక్కువ ఆదాయం ఉండేవారు నివసించే ప్రాంతాల్లో వ్యాయామ సౌకర్యాలు, ఆరోగ్యకరమైన ఆహారవనరులు లేకపోవడమే కాక, అధిక ఒత్తిడి కూడ ఊబకాయానికి కారణమౌతోందని చెప్తున్నారు.  

ఆదాయం తక్కువగా ఉన్నవారు నివసించే ప్రాంతంలో ఎక్కువకాలం ఉండటం  యువతుల జీవితకాల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అమెరికా కొలరాడో డెన్వర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ లిప్పర్ట్ తెలిపారు.  నేషనల్ సర్వే డేటాలోని  ఏడవతరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పరిశోధన బృందం 13 సంవత్సరాలపాటు పరిశీలించింది. విద్యార్థులు బాల్యంనుంచి యుక్త వయసులోకి మారుతున్న సమయంలో వారు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి, వారిలో ఊబకాయం సమస్య సంక్రమిస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడి అయింది.

పిల్లలు...బాల్యం నుంచీ యుక్త వయసు వరకూ పేదలు ఉండే ప్రాంతాల్లో స్థిరంగా  ఉంటే వారిలో ఊబకాయం సమస్య అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. అదే యుక్త వయసులోకి మారుతున్న సమయంలో పేదలు ఉన్న ప్రాంతంనుంచీ సంపన్న ప్రాంతానికి మారినప్పుడు ఊబకాయ సమస్య తక్కువగానూ, సంపన్న ప్రాంతంనుంచీ తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతానికి చేరినప్పుడు స్థూలకాయం సమస్య ఎక్కువవుతున్నట్లు తేలింది.

ముఖ్యంగా మురికివాడల్లోనూ, పేదలు నివసించే ప్రాంతాల్లోనూ ఎక్కువకాలం పెరిగిన యువతులు భవిష్యత్తులో ఊబకాయం సమస్యతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువతులకు సానుకూల వనరులు సమకూర్చడం, నివాస పరిస్థితులు మెరుగు పరచడంవల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంగా కొనసాగే అవకాశం ఉంటుందని లిప్పర్ట్  సూచించారు.

>
మరిన్ని వార్తలు