మీ డేటా విలువ రూ.3,580 మాత్రమే!

18 Dec, 2018 02:45 IST|Sakshi

మాస్కో: డేటా లీక్, డేటా హ్యాకింగ్‌ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న అంశం. సంపాదన నుంచి సంసారమంతా డిజిటల్‌ లైఫ్‌తో ముడిపడటమే దీనికి కారణం. అయితే సోషల్‌ మీడియా ఖాతాల సమాచారం మొదలు మన బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డుల సమాచారాన్ని దొంగిలించి కేవలం రూ.3,580కే సైబర్‌ నేరస్తులు అమ్ముతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. రష్యాలోని సైబర్‌ సెక్యూరిటీ కంపెనీకి చెందిన క్యాస్పర్‌స్కీ ల్యాబ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. వ్యక్తిగత డేటాను సైబర్‌ నేరగాళ్లు ఉపయోగిస్తున్న తీరు, వారు ఎంత ధరకు అమ్ముతున్నారో వంటి విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ‘డార్క్‌ వెబ్‌’మార్కెట్లపై పరిశోధనాత్మక దర్యాప్తు చేపట్టారు. డార్క్‌ వెబ్‌లు ఇంటర్నెట్‌లోనే ఉంటాయి కానీ, సెర్చ్‌ ఇంజన్‌లో కనపడవు.

వాటి యాక్సెస్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అవసరమవుతుంది. సోషల్‌ మీడియా ఖాతా, బ్యాంకింగ్‌ సమాచారంతో పాటు ఉబర్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి పాపులర్‌ సర్వీస్‌ వెబ్‌సైట్‌లలోనూ డేటా చోరీకి గురవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటితో పాటు గేమింగ్‌ వెబ్‌సైట్స్, డేటింగ్‌ యాప్స్, పోర్న్‌ వెబ్‌సైట్స్, క్రెడిట్‌ కార్డ్‌ల సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు దొంగిలించి రూ.72 నుంచి రూ.3,580కు అమ్ముతున్నట్లు అంచనా వేశారు. డేటా చోరీ వల్ల వ్యక్తి డబ్బుతో పాటు హోదా, గౌరవం దెబ్బతింటుందని, సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా ఉండటానికి ఒకే విధమైన పాస్‌వర్డ్‌ వాడకపోవడమే మార్గమని శాస్త్రవేత్త డేవిడ్‌ జాకోబి సూచించారు.  

మరిన్ని వార్తలు