మూడు ఉగ్రదాడుల నుంచి తప్పించుకున్నాడు!

24 Mar, 2016 09:33 IST|Sakshi
మూడు ఉగ్రదాడుల నుంచి తప్పించుకున్నాడు!

ఆ యువకుడు చాలా అదృష్టవంతుడు. సాధారణంగా ఉగ్రదాడి జరిగిందంటే అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ఉగ్రదాడుల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడంటే అతడు గట్టిపిండమేనని చెప్పుకోక తప్పదు. అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన మాసన్ వెల్స్ (19).. బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతడు ఈ దాడిలో గాయపడ్డాడు. వెల్స్ తలకు గాయమైంది, కొన్నిచోట్ల ఏవో గుచ్చుకున్నాయి, చాలాచోట్ల కాలినగాయాలు కూడా అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం మాత్రం తప్పింది.

ఇంతకుముందు 2013 ఏప్రిల్ నెలలో బోస్టన్‌ మారథాన్ పోటీలు జరిగినప్పుడు కూడా అతడు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. స్వయంగా అతడి తల్లి ఆ రేసులో పాల్గొన్నారు. వెల్స్, అతడి తండ్రి కలిసి చూస్తుండగా.. ఉన్నట్టుండి భూమి కంపించినట్లు అనిపించింది. అక్కడ ఉగ్రవాదులు పెట్టిన ప్రెషర్ కుక్కర్ బాంబు కేవలం ఒక బ్లాకు దూరంలో పేలింది. దాంతో అప్పుడు కూడా కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ఇక గత నవంబర్‌లో జరిగిన ప్యారిస్ ఉగ్రవాద దాడుల సమయంలోనూ వెల్స్ అక్కడే ఉన్నాడు. వెల్స్ ప్యారిస్ వెళ్లాడని ముందే తెలియడంతో, ఉగ్రదాడి విషయం తెలియగానే అతడి తండ్రి చాడ్ వెల్స్ వెంటనే అతడి గురించి ఆందోళన చెందారు. దాదాపు 8 గంటల తర్వాత అతడితో మాట్లాడగలిగారు. అప్పటికి అతడికి సర్జరీ కూడా అయిపోయింది. అదృష్టం బాగుండి అప్పుడు కూడా కొంత గాయపడ్డాడు గానీ, బతికే ఉన్నట్లు తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. దేవుడు వెంట ఉండబట్టే ఆ కుర్రాడు ప్రతిసారీ ఉగ్రదాడుల స్థలంలోనే ఉన్నా ప్రాణాలతో బయట పడుతున్నాడని వెల్స్ కుటుంబ స్నేహితులైన క్రిస్ లాంబ్సన్ చెప్పారు.

మరిన్ని వార్తలు