ఆపరేషన్లకూ యూట్యూబే ఆధారం!

4 Mar, 2016 20:04 IST|Sakshi
ఆపరేషన్లకూ యూట్యూబే ఆధారం!

ఏదైనా కొత్త వంట గురించి తెలుసుకోవాలంటే గృహిణులు వెంటనే చూసేది.. యూట్యూబ్. కానీ ఇప్పుడు ఈ ఆన్‌లైన్ మాయాజాలం వైద్యరంగాన్ని కూడా వదలడం లేదు. నిపుణులు సైతం ఆపరేషన్లలో సరికొత్త పద్ధతులు తెలుసుకోడానికి యూట్యూబ్ లాంటి ఆన్‌లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారట. ఆమెరికన్ అకాడమీ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ అండ్ రీ కనస్ట్రక్టివ్ సర్జరీ (ఏఏఎఫ్పీఆర్ఎస్)కి చెందిన బృందం జరిపిన సర్వేలు యూట్యూబ్ వాడకంపై కొత్త విషయాలను వెల్లడించాయి. ప్లాస్టిక్ సర్జరీల విషయంలో వస్తున్న కొత్త పద్ధతుల గురించి యూట్యూబ్‌లో చూడటంతో పాటు.. వాటిని ఆచరణలో కూడా పెడుతున్నట్లు భారత సంతతికి చెందిన అనిత్ సెత్నా బృందం చేసిన అధ్యయనాల్లో కనుగొన్నారు. ఏఏఎఫ్పీఆర్ఎస్ సభ్యులు కొందరితో సర్వే చేయగా.. మొత్తం 202 మంది దానికి స్పందించారు.

సాంకేతిక, సాంకేతికేతర విషయాలు తెలుసుకోడానికి ప్రధానంగా సమావేశాల్లో పాల్గొనడం, జర్నల్స్ చదవడం, సహోద్యోగులతో చర్చించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి. అయితే.. సర్వేలో పాల్గొన్నవారిలో 64.1 శాతం మంది మాత్రం.. రైనో ప్లాస్టీ, సూదులతో చేసే చికిత్సా విధానాలను, అందులోని కొత్త పద్ధతులను తెలుసుకునేందుకు కనీసం ఒక్కసారైనా తాము యూట్యూబ్ వీడియోలు చూసినట్లు చెప్పారు. వాళ్లలో 83.1 శాతం మంది ఏకంగా తాము అలా చూసిన పద్ధతులను ఆచరణలో కూడా పెడుతున్నట్లు చెబుతున్నారు. అనుభవం ఉన్న వాళ్ల కంటే.. అంతగా అనుభవం లేనివాళ్లు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారట. ఇంటర్‌నెట్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆయా ఆపరేషన్ల నాణ్యత విషయంలోనే ఆందోళన వ్యక్తమవుతోందని సెత్నా బృందం తెలిపింది. వీరి పరిశోధన వ్యాసం జామా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమైంది.

మరిన్ని వార్తలు