నేపాల్‌కు అండగా నిలవాలి ట్విటర్‌లో వైఎస్ జగన్

28 Apr, 2015 02:56 IST|Sakshi
నేపాల్‌కు అండగా నిలవాలి ట్విటర్‌లో వైఎస్ జగన్

హైదరాబాద్: నేపాల్ భూకంపం ప్రజలకు తీరని వేదనను మిగిల్చిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆపత్కాలంలో భారత్.. నేపాల్‌కు అండగా నిలవాలని, అన్ని విధాలా సాయపడాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌కు సోమవారం భారత పార్లమెంట్ సంఘీభావం ప్రకటించింది. మృతులకు నివాళులర్పించింది. సహాయ చర్యల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సహా లోక్‌సభ ఎంపీలు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా అందించారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు భారత్ వచ్చేందుకు వీసాలిస్తామని భారత్  ప్రకటించింది. నేపాల్‌ను అన్ని రకాలా ఆదుకుంటామంది.


నేపాల్‌కు సాయం చేయడానికి తక్షణమే స్పందించిన ప్రభుత్వాన్ని, మోదీని పలువురు ఎంపీలు ప్రశంసించారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్ర మహాజన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూకంపం వల్ల నేపాల్‌లో, భారత్‌లో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. సభ్యులంతా నిల్చుని మృతులకు నివాళిగా కాసేపు మౌనం పాటించారు. రాజ్యసభలోనూ సభ్యులు నివాళులర్పించారు. ఈ బాధాకర సమయంలో పొరుగుదేశానికి సాయంగా నిలవడం ప్రశంసనీయమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఉభయ సభల్లోనూ భూకంపంపై, ఆ విపత్తును ఎదుర్కొనే సన్నద్ధతపై చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు