జనానికి తిండి లేకున్నా.. బర్త్‌డే కోసం 5.5 కోట్లు!

28 Feb, 2016 18:15 IST|Sakshi
జనానికి తిండి లేకున్నా.. బర్త్‌డే కోసం 5.5 కోట్లు!

హరారే: అది నిరుపేద ఆఫ్రికా దేశం. లక్షల మంది జనం తిండిలేక నిత్యం అల్లాడుతున్నారు. అయినా ఆ దేశాధినేత మాత్రం అక్షరాల రూ. 5.5 కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా తన పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఇలా కోట్లు తగలేసి జన్మదిన వేడుకలు చేసుకున్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచంలోనే కురువృద్ధ దేశాధినేతగా పేరొందిన ముగాబే ఇటీవల 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన భార్య గ్రేస్‌తో కలిసి వాయవ్య నగరం మాస్వింగోలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. గ్రేట్ జింబాబ్వే స్మారక స్తూపం వద్ద 91 బెలూన్లను ఎగురవేశారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఒకవైపు మాస్వింగోతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. ఇక్కడి ప్రజలు తిండిలేక అవస్థ పడుతున్నారు. వారికి విదేశాల నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునేందుకు ఉద్దేశించిన నిధులను దారి మళ్లించి అధ్యక్షుడు అట్టహాసంగా రూ. 5.5 కోట్లతో జన్మదినం జరుపుకొన్నాడని, ప్రజలు ఆకలితో చస్తుంటే, ఆయన ప్రజాధనాన్ని దుబారా ఖర్చుచేసి జల్సాలు చేస్తున్నాడని జింబాబ్వే ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు