మోడల్‌పై దాడి చేసిన దేశాధ్యక్షుడి భార్య

16 Aug, 2017 11:52 IST|Sakshi
మోడల్‌పై దాడి చేసిన దేశాధ్యక్షుడి భార్య

జోహన్నెస్‌బర్గ్‌: ఓ దేశాధ్యక్షుడికి భార్య అంటే ఆ దేశానికి ప్రథమ పౌరురాలు. ఆమే గతి తప్పి ప్రవరిస్తే. బాధ్యతతో ఉండాల్సిన ఆమె తన స్ధాయిని మరచి ప్రవర్తిస్తే.. పౌరులు ఎలా ప్రవర్తించాలి. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే భార్య గ్రేస్‌ ముగాబే చేసిన ఓ దుశ్చర్య ఆ దేశానికి కళంకం తెచ్చే విధంగా తయారైంది. అనారోగ్య కారణాలతో కొద్ది రోజుల క్రితం గ్రేస్‌ ముగాబే మెడికల్‌ పాస్‌పోర్టుపై దక్షిణాఫ్రికాకు వచ్చారు.

ఇద్దరు తనయులతో పాటు జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ హోటల్‌లో ఉంటున్నారు. బుధవారం హోటల్‌కు గ్రేస్‌ ముగాబే తనయులతో మాట్లాడేందుకు ఓ మోడల్‌ వెళ్లారు. తనయుల గదిలో నుంచి మహిళ మాట్లాడుతున్న శబ్దం విని లోపలికి వెళ్లిన గ్రేస్‌.. అనుమానంతో ఆమెపై దాడికి దిగారు. తనయులు వారిస్తున్నా వినకుండా కొరడాతో మోడల్‌ను చితక్కొట్టారు.

అక్కడి నుంచి బయటపడిన ఆమె జోహన్నెస్‌బర్గ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రేస్‌ ముగాబేను అరెస్టు చేసేందుకు హోటల్‌కు వెళ్లారు. అప్పటికే ఆమె తనయులతో కలసి తిరిగి జింబాబ్వేకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి జింబాబ్వే విదేశాంగ మంత్రితో చర్చిస్తున్నట్లు దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

గ్రేస్‌ ముగాబే గతంలో కూడా విచక్షణా రహితంగా ఓ వ్యక్తిపై దాడికి దిగిన సంఘటన ఉంది. ఓ హోటల్‌లోని వ్యక్తిపై గ్రేస్‌.. దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయి తిరిగి జింబాబ్వే వచ్చేశారు. ప్రస్తుతం గ్రేస్‌ ముగాబే ఎక్కడ ఉన్నారన్న విషయంపై క్లారిటీ లేదు.

మరిన్ని వార్తలు