రాబర్ట్‌ ముగాబేకి షాక్‌..

20 Nov, 2017 02:06 IST|Sakshi

పార్టీ చీఫ్‌గా తొలగింపు

జింబాబ్వే అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు అంగీకారం

జింబాబ్వేలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.    

హరారే: జింబాబ్వేలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతకు ముందు అధికార జాను–పీఎఫ్‌ పార్టీ తమ చీఫ్‌గా ముగాబేను తొలగించి ఆ స్థానంలో మాజీ ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ ఎమ్‌నాంగా గ్వాని నియమించింది. సోమవారం నాటికి ముగాబే రాజీనామా చేయకపోతే తామే అభిశంసిస్తామని హెచ్చరించింది.

2018లో జరిగే ఎన్నికల్లో తమ అధ్యక్ష అభ్యర్థి ఎమర్సన్‌ అని ప్రకటించింది. ముగాబే భార్య గ్రేస్‌ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా ఆర్మీ చీఫ్‌ కాన్‌స్టాంటినో చివెంగా, ముగాబేతో చర్చలు జరిపారు. ఈ సమావేశం వివరాలు వెల్లడికాలేదు. ముగాబే వృద్ధాప్యాన్ని సాకుగా చూపి అధికారం చేపట్టి దేశ వనరులను కొల్లగొట్టడానికి ఆయన భార్య గ్రేస్, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని పార్టీ ప్రతినిధి ఒబర్ట్‌ ఎంపోఫు ఆరోపించారు. ముగాబేను గృహ నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు