వామ్మో! జాంబీలు.. వణికిపోతున్న ప్రజలు

6 Apr, 2018 19:24 IST|Sakshi

ఓహియో : హాలీవుడ్‌ చిత్రాలు ఎక్కువగా చూసేవారికి జాంబీల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మనుషులుగానీ, జంతువులుగానీ.. రాక్షసుల తరహాలో మారి.. ఇతరులపై పడి ప్రాణాలు తీయటం.. ఆపై గాయాలతో కూడా జాంబీల్లాగా మారి దాడులు చేస్తుంటారు. అయితే అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో రక్కూన్ల(ఉడుత తరహా జీవి)ను చూస్తే చాలూ జనాలు వణికిపోతున్నారు. కారణం అవి జాంబీల్లా మారి మనుషులపై దాడులు చేస్తుండటమే. 

గత శుక్రవారం ఈశాన్య ఓహియో ప్రాంతానికి చెందిన రాబర్ట్‌ కాగ్గెషల్‌ అనే ఫోటోగ్రాఫర్‌ తన కుక్కలతో ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఓ రక్కూన్‌ ఆయన వైపు దూసుకొచ్చింది. ‘దాని పళ్లు మాములుగా లేవు. ఏదో రాక్షసిని చూసిన భావన కలిగింది. బిగ్గరగా శబ్ధం చేస్తూ నా కుక్కలపై దూకపోయింది. తర్వాత నాపై కూడా దాడి చేయబోయింది. నా కాళును కొరకపోయింది. తృటిలో తప్పించుకున్నా. దాని ఆకారం మాములుగా కన్నా పెద్దదిగా అనిపించింది. అది ఖచ్ఛితంగా జాంబీనే’ అని రాబర్ట్‌ భయానక అనుభవాన్ని వివరించాడు. 

‘సాధారణంగా అవి సాధు జీవులు. చాలా అమాయకంగా కనిపిస్తాయి. చిన్న చిన్న కీటకాలు.. పండ్లను తినే ఆ జీవులు. అయినా ఎందుకిలా చేశాయో అర్థం కావట్లేదు. బహుశా దానికి ఏదైనా వ్యాధి సోకి ఉంటుందేమో. దీనిపై పరిశోధనలు ప్రారంభించాం’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే గత మూడు వారాలుగా ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించి డజనుకు పైగా ఫిర్యాదులు అందాయని యంగ్స్‌టౌన్‌ పోలీసులు చెబుతున్నారు. పగటి పూటే ఈ దాడులు జరుగుతుండటంతో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.

మరిన్ని వార్తలు