కర్ణాటకలో బీజేపీదే విజయం!!

6 May, 2018 00:33 IST|Sakshi
మురళీ ధర్‌రావు

కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్‌ రానుందా? అదే జరిగితే బీజేపీ జేడీఎస్‌తో జట్టు కట్టనుందా? అందుకే దేవెగౌడపై ప్రధాని నరేంద్రమోడీ సానుకూల వ్యాఖ్యలు చేశారా? కాంగ్రెస్‌కు సిద్ధరామయ్య బలమైతే.. బీజేపీకి యడ్యూరప్పే బలహీనంగా మారారా? అసలు బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? అనే అంశాలపై భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కర్ణాటక పార్టీ ఇన్‌చార్జ్, ఎన్నికల ఇన్‌చార్జ్‌ మురళీ ధర్‌రావు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్య సారాంశం.

కన్నడ రాజకీయం వేడెక్కినట్లుంది? మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఫలితాలపై మీ అంచనా ఏమిటి?
బీజేపీ గ్రాఫ్‌ చాలా బాగుంది. పార్టీలోని అన్ని మోర్చాలతో పాటు సంస్థాగతంగా, కార్యక్రమాల పరంగా, సభలు, మేనిఫెస్టో అన్నీ బేరీజు వేస్తే కాంగ్రెస్‌ను బీజేపీ వెనకేసింది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు పర్యాయాలు యడ్యూరప్ప తిరిగారు. అద్భుతమైన ర్యాలీలు చేశాం. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నరేంద్ర మోదీ సభల స్పందన బాగుంది. అమిత్‌షా పర్యటనలు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేశాయి. 55వేల బూత్‌కమిటీలు వేశాం. కాల్‌సెంటర్ల ద్వారా రోజూ రిపోర్ట్‌ చేస్తున్నాం. ప్రతీ బూత్‌కమిటీలో 10–15మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ అన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సిద్ధరామయ్య తన పాలనలో అన్ని వర్గాలను సంతృప్తి పరచలేకపోయారు. రాహుల్‌గాంధీ ప్రచారపర్వంలో కర్నాటక ప్రజలను ఆకర్షించలేకపోయారు. కచ్చితంగా మేం గెలవబోతున్నాం.

కర్ణాటకలో హంగ్‌ తప్పదా? దేవెగౌడపై మోదీ వ్యాఖ్యలను జేడీఎస్‌ను దగ్గర చేర్చుకునే ప్రయత్నమే అనుకోవచ్చా?
జేడీఎస్,కాంగ్రెస్‌లు వారి స్వలాభం కోసం ఇలాంటి ప్రచారానికి తెరలేపారు. కర్ణాటకలో హంగ్‌ వచ్చే ప్రసక్తే లేదు. ప్రజలు అలాంటి తీర్పు ఇవ్వరు. ఓటమికి భయపడి హంగ్‌ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది. వ్యక్తిగత దూషణలకు దిగకుండా పెద్దవారిని గౌరవించాలనేది మాపార్టీ సంస్కృతి. మాజీ ప్రధానికి గౌరవం ఇవ్వాలనే దేవెగౌడపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, సిద్ధాంతాల పరంగా, ఎన్నికల పరంగా జేడీఎస్‌ మాకు ప్రత్యర్థే.

ఎన్ని స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నారు? కాంగ్రెస్‌కు సిద్ధరామయ్యే బలం కాగా, బీజేపీకి యడ్యూరప్పే బలహీనంగా మారారు అంటున్నారు. అది పార్టీకి మైనస్‌ కాదా?
150 సీట్లు మా లక్ష్యం! ఈ నెల 12వ తేదీ వరకూ మేం విజయం కోసం పరుగెడుతూనే ఉంటాం. రోజూ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాం. 400 సభలు నిర్వహిస్తున్నాం. యడ్యూరప్ప ఒక్కరే 100 సభలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యడ్యూరప్ప ఒక్కరే! బెంగళూరు నుంచి కోలార్‌ వరకూ ఎక్కడికి వెళ్లినా 15–20 వేలమంది యడ్యూరప్ప సభలకు వస్తారు. గెలవలేననే భయంతోనే సిద్ధరామయ్య రెండుసీట్లలో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి, బాదామిలో ఓడిపోతున్నారు. బాదామీలో శ్రీరాములు వందశాతం గెలవబోతున్నారు.

యడ్యూరప్ప  నాయకత్వాన్ని కొందరు కీలక నేతలు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు? ఇది ప్రతికూలం కాదా?
అన్నీ సమసిపోయాయి. యడ్యూరప్ప బలమైన నాయకుడు. ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి! సిద్ధాంతం కోసం పని
చేశారు. కొన్ని చేదు ఘటనలను నేతలు,కార్యకర్తలు మరిచిపోయారు. యడ్యూరప్ప మా నాయకుడు అని నేతలతో పాటు కార్యకర్తలు భావిస్తున్నారు. అంతర్గతంగా చిన్నచిన్న సమస్యలు సహజం. అసంతృప్తులను బుజ్జగించాం. అంతర్గత వివాదాలను పరిష్కరించుకోవడంలో మా పార్టీకి ఉన్నంత సామర్థ్యం మరేపార్టీకి లేదు.

ఎన్నికల తర్వాత శ్రీరాములు కూడా సీఎం అభ్యర్థి కావొచ్చు! అనే ప్రచారం జరుగుతోంది? అందులో వాస్తవం ఏంత?
సీఎం సీటు ఖాళీ లేదు. యడ్యూరప్పే మా సీఎం అభ్యర్థి! ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదు. అయితే శ్రీరాములు బలమైన గిరిజన నాయకుడు. విశేష ప్రజాధారణ ఉన్న నేత! యడ్యూరప్ప తర్వాత అన్ని సభలు నిర్వహిస్తున్న నాయకుడు. జాతీయస్థాయిలో మాకు కీలక నేత! రాబోయే రోజుల్లో శ్రీరాములు పార్టీకి బలమైన నేతగా మారతాడు. సేవ చేస్తాడు.

కర్నాటకలో ఓడిపోతే దక్షిణాన మీకు మనుగడ ఉండదని అనుకోవచ్చా?
దక్షిణభారతదేశానికి ముఖద్వారమైన కర్నాకటలో కచ్చితంగా గెలవబోతున్నాం. మా గెలుపు దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బలోపేతమయ్యేందుకు పూర్తిగా లాభించనుంది.
బీజేపీని ఓడించండని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు? తెలుగు ప్రభావిత రాష్ట్రాల్లో ఈ తరహా ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది?
చంద్రబాబు తన జీవితంలో చేసిన ఘోర తప్పిదం ఇదే! తన పరి మితులు దాటి రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఆంధ్ర ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుంది. తెలుగు ప్రజలు ఏళ్లుగా ఇక్కడ ఉన్నారు. కర్నాటకలో పరిస్థితులు తెలుసుకుని తెలుగు ప్రజలు ఓటేస్తారు. చంద్రబాబు మాట ఎవ్వరూ వినరు. ఏపీలోని పరిస్థితులను ముడిపెట్టి చంద్రబాబు రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారు. అది నెరవేరదు.
– సాక్షి ప్రత్యేక ప్రతినిధి, బెంగళూరు

మరిన్ని వార్తలు