పరుగో  పరుగు!

30 Sep, 2018 01:54 IST|Sakshi

సినిమాలు అంతగా లేని, టీవీ సీరియల్స్‌ అసలే లేని రోజులవి.మా ఊరి పురోహితులు రాత్రి అవగానే ఎవరి అరుగుల మీద వాళ్లు కూర్చొని భారతంలోని పద్యాలను రాగయుక్తంగా పాడుతూ అర్థాలు చెప్పేవాళ్లు. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు  ప్రచురించే నాటకాల పుస్తకాలను మద్రాస్‌ నుంచి తెప్పించి మా నాన్నగారు నాటకీయంగా చదివి వినిపించేవారు. ‘శ్రీకృష్ణ తులాభారం’ ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’‘కురుక్షేత్రం’ ‘సతీసావిత్రి’ వంటి నాటకాలు ఇందులో ఉండేవి.కంగుంది కుప్పం అనే ఊరికి చెందిన నాటక ట్రూపు మా ప్రాంతమంతా తిరిగి టికెట్‌పై నాటకాలు ఆడేవారు. ఆరోజుల్లో స్త్రీ పాత్ర స్త్రీలే ధరించే నాటక గ్రూపు అది. మంచి మంచి డ్రస్సులు, మేకప్‌ సామాగ్రి, స్టేజీ అలంకరణతో నాటకాన్ని రక్తి కట్టించేవాళ్లు. టికెట్‌కు రెండణాల చొప్పున అమ్మి నాటకాన్ని ప్రదర్శించేవారు. ‘సతీసావిత్రి నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు’ అని సాయంత్రమే తప్పెటతో ఊళ్లో చాటింపు వేశారు. నాటకం చూడ్డానికి ఊళ్లో జనం ఎగబడ్డారు.   పెట్రోమాక్స్‌  లైట్ల వెలుగులో జనం స్టేజీకి ఎదురుగా కంపౌండ్‌ పరదాకు ఆనుకొని కూర్చున్నారు. స్త్రీలు ఒక పక్క, పురుషులు మరో పక్క కూర్చున్నారు. మధ్యలో దారి విడిచిపెట్టారు. ‘పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ సదానంద’ పాట పూర్తయింది. తెర పైకి లేచింది. సావిత్రి, సత్యవంతులు స్టేజీ పైకి వచ్చారు. పాటలు పద్యాలు ఊపందుకున్నాయి. 

రెండుమూడు సీన్లు అయిన తరువాత యమధర్మరాజు రాబోతున్నాడు. ప్రేక్షకుల ఈలలతో స్టేజీ ముందు గోలగోలగా ఉంది. మా ఊరి వీరాచారి యమధర్మరాజు పాత్ర పోషించడంతో క్రేజ్‌ పెరిగింది. వీరాచారికి నాటకాల్లో వేసిన అనుభవం ఉంది. ఎప్పుడైనా పురాణపఠనం జరిగేటప్పుడు ఆయన పాటలు, పద్యాలు రాగయుక్తంగా పాడేవాడు.‘పో బాల పొమ్మికన్‌ నావెంట రా వలదు రా తగదు’ పాటను వీరాచారి బాగా పాడతాడు.తెర పైకి లేసింది.యమధర్మరాజుగారి పటాటోపం తెలియజేసేట్లు హోర్మోనియం, తబలాలు పెద్ద శబ్దంతో మోగాయి. ఒక చేతిలో యమపాశం, మరొక చేతిలో గదతో యమధర్మరాజు వేషంలో ఉన్న వీరాచారి నిజమైన దున్నపోతుపై ఆసీనుడై కనిపించడంతో  ఈలలు చప్పట్లు. ఈ శబ్దాలకు తోడు హార్మోనీ, తబలా శబ్దాలతో పాపం దున్నపోతు బెదిరిపోయింది. వీరాచారిని స్టేజీపై పడదోసి పరదాలను చీల్చుకొని  పరుగులు తీసింది. వీరాచారి చెయ్యి విరిగింది. అదృష్టం కొద్దీ ప్రేక్షకులలో ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ తలా ఒక దిక్కు పరుగులు తీశారు. ‘సహజంగా ఉంటుంది’ అని పక్కింటి వాళ్లను బతిమిలాడి దున్నపోతును తీసుకొచ్చాడట వీరాచారి.సహజత్వం సంగతేమిటోగానీ... దున్నపోతు పుణ్యమా అని వీరాచారి చేయి విరగ్గొట్టుకోవాల్సి వచ్చింది.
– సామా కేశవయ్య, తుంబూరు, చిత్తూరు జిల్లా 

మరిన్ని వార్తలు