సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

16 Jan, 2018 10:05 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లి రైతులు కోరుట్ల-జగిత్యాల రహదారిపై మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. శ్రీరామ్‌సాగర్‌ కాలువకింద ఉన్న తమ భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని, తమ విద్యుత్‌ మోటార్ల కనెక్షన్లను విద్యుత్‌ అధికారులు తొలగించారని వారు ఆరోపిస్తున్నారు.

ఎ‌స్సారెస్పీ నీళ్లు తమ పంటలకు అందకుండా అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. రహదారిపై రైతులు భైఠాయించడంతో వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

తాటిపల్లి రైతుల ఆందోళనకు జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. విద్యుత్‌ మోటార్లకు కనెక్షన్‌ పునరుద్ధరించి సాగునీరు ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు