రేషన్‌.. పరేషాన్‌..

10 Feb, 2018 14:18 IST|Sakshi
జగిత్యాలలో ఈ–పాస్‌ మిషన్‌ మొరాయించడంతో క్యూలో నిలబడిన లబ్ధిదారులు

15 వరకే రేషన్‌ సరుకుల పంపిణీ

మొరాయిస్తున్న ఈ–పాస్‌ మిషన్లు

రేషన్‌ సరుకుల పంపిణీలో ఆలస్యం 

దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు

వారంలో 25 శాతమే పంపిణీ

మిగిలేది మరో వారం రోజులే..

ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

కిరోసిన్‌ పంపిణీలో అదే పరిస్థితి.. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రేషన్‌ దుకాణాలకు అందజేసిన ఈపాస్‌ మిషన్‌లలో లబ్ధిదారులు  వేలిముద్ర వేస్తేనే  సరుకులను అందజేస్తారు. అయితే సర్వర్‌ సమస్యతో ఈపాస్‌ మిషన్లు మొరాయిస్తుండటంతో సరుకుల పంపిణీ 40 శాతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దుకాణాల ఎదుట లబ్ధిదారులు పడిగాపులు కాస్తూ  అవస్థలు పడుతుండగా, అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్‌లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో ఈ పాస్‌ యంత్రాలు అందజేసిన ఒయాసిస్‌ కంపెనీ సెప్టెంబర్‌ నుంచి నూతన విధానంలో సరుకులు పంపిణీ చేసేలా సాంకేతిక జోడించింది. ఆ సమయంలో తదనుగుణంగా సంబంధిత యంత్రాలు అందజేయగా సరుకుల పంపిణీ సాగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ను మార్పు చేయడంతో ఈపాస్‌ యంత్రాలు దాదాపు స్థంబించిపోయాయని డీలర్లు వాపోతున్నారు. సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు పడిగాపులు గాసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 7వ తేదీ దాటినప్పటికీ సరుకుల పంపిణీ ప్రారంభించని దుకాణాలు ఉమ్మడి జిల్లాలో 600కు పైగానే ఉన్నాయని సమాచారం. సాంకేతిక సమస్యతో పరికరాలను పట్టుకుని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వస్తున్నారు.

ఈ–పాస్‌ యంత్రాల వెనుక ఉద్దేశం..
పేదల పొట్ట నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని, ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో, అదే స్థాయిలో రేషన్‌ బియ్యంలో అక్రమాలకు తావు ఏర్పడింది. బియ్యం రేషన్‌ దుకాణాలకు పూర్తిగా చేరకుండానే, మిల్లర్లకు, వ్యాపారుల దరికి చేరుతున్నాయి. ఇలా ప్రతి నెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అక్రమాలను అడ్డుకోలేక పోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌లు నియంత్రణపై దృష్టి సారించారు.

హైదరాబాద్‌ నగరంలో ఈ– రేషన్‌ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నెల నుంచి శ్రీకారం చుట్టింది. రేషన్‌ దుకాణాలలో వేలిముద్రల (ఈ–పాస్‌) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్‌ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కసరత్తును అన్ని జిల్లాల్లో ప్రారంభించింది.   
ఇబ్బందికరంగా సరుకులకు 

పంపిణీకి గడువు... 
ప్రభుత్వం రేషన్‌సరుకులను ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకే పంపిణీ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే 7వ తేదీ దాటినప్పటికీ  ఈ పాస్‌ యంత్రాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో గడువులోగా పంపిణీ జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్‌ డీలర్‌ సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా సర్వర్‌ సమస్యతో ఒక్కో డీలరు రోజుకు 50 మందికి మించి సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు.

ఈ పాస్‌ యంత్రంలో వేలిముద్ర వేసిన అనంతరం డిస్‌ప్లేలో పేరు రావడం తదుపరి తూకం వేయడం ప్రక్రియతో దాదాపు 10 నుంచి 20 నిమిషాలు పడుతున్న సంధర్డాలుంటున్నాయి. ఈ పాస్‌ యంత్రానికి.. తూకం యంత్రానికి అనుసంధానం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో 40 శాతానికి పైగా దుకాణాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సరుకులను సకాలంలో.. గడువులోగా పంపిణీ చేయడం సందిగ్ధంగా మారింది. యంత్రాల సాంకేతిక సమస్యలను కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని డీలర్లు వాదిస్తున్నారు.

వేలిముద్రలు పడక తిప్పలు...15వ తేదీ వరకే పంపిణీతో ఇబ్బంది
రేషన్‌దుకాణాల వద్దకు కార్డుదారులే స్వయంగా వచ్చినా బయోమెట్రిక్‌ యంత్రంపై వారి వేలిముద్రలు పడనికారణంగా డీలర్లు సరుకులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వేలిపై ఉన్న గీతలు యంత్రంపై పడని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులంటున్నారు. అయితే చాలా కొద్దిమందికే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, అలాంటి వారికి సరుకులను ఇచ్చేందుకు (కార్డుదారుల్లో 1శాతం మించకుండా) డీలర్లకు అనుమతిచ్చామని తెలిపారు. ఈ పాస్‌ విధానంతో సబ్సిడీ సరుకులను తీసుకెళ్లేందుకు వద్దులు, ఒంటరిగా ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో కార్డుదారులు లేకున్నా వారి బంధు, మిత్రులు వచ్చి సరుకులు తీసుకెళ్లే అవకాశముండేది. ఇపుడు ఆ అవకాశం లేకపోవడంతో డీలర్ల వద్ద సరుకులు ఎక్కువ మొత్తంలో మిగులుతున్నాయి. కాగా ప్రతి నెల 15వతేది లోగానే లబ్ధిదారులు రేషన్‌ దుకాణాలనుంచి సరుకులను పొందాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈపాస్‌ మిషన్లు అపుడపుడు పనిచేయకపోవడంతో సమయమంతా వధా అవుతోందని, తమకు వీలున్నపుడు వచ్చే అవకాశం లేకుండా పోతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే నెల చివరి వారం వరకు పంపిణీ చేసేలా చూడాలన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పంపిణీ అంతకంతే.. 

10 రోజుల్లో 50 శాతమే
ఉమ్మడి జిల్లాల్లో ని రేషన్‌ దుకాణాలలో ఈ పాస్‌  విధానంలో సాంకేతిక అంతరాయాలు అవరోధంగా మారాయి..  కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండల లెవెల్‌ స్టాక్‌ పాయింట్ల (ఎంఎల్‌ఎస్‌) నుంచి 1,880 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతినెల 16,644 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పంచదారను అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు అందజేస్తున్నారు..  మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 9,41,948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 బియ్యంకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ 50 శాతం కూడా పంపిణీ చేయలేదని తెలుస్తోంది. 

అయితే సర్వర్‌ మార్పుతో గత కొద్ది రోజులుగా ఈపాస్‌ మిషన్‌లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా... లబ్దిదారులకు తిప్పలు తప్పడం లేదు.. ఈ విషయంలో అధికారుల ముందస్తు ప్రణాళికలోపం స్పష్టమవుతోంది. కిరోసిన్‌ పంపిణీలోను ఇదే రకమైన సమస్య ఉత్పన్నమవడం చర్చనీయాంశంగా మారింది. సరుకుల పంపిణీకు ముందే సర్వర్‌ మార్పును, సాంకేతిక సమస్యలను అధిగమిస్తే డీలర్లకు.. ఇటు లబ్దిదారులకు తిప్పలుండేవి కావని స్పష్టమవుతోంది.

ఇప్పటివరకు బియ్యం తీసుకోలే.. 
గీ ఏలి ముద్రలు ఎప్పుడు సురువు అయినయో గప్పడి నుంచి నా చేతి వేలిముద్రలు వస్తలేవు అంటున్నారు. నా భర్త వేలిముద్రలు కూడ మిషన్‌ తీసుకుంట లేదు. బియ్యం పంచినప్పుడల్ల పోయినా ఎన్నిసార్లు వేలిముద్రలు పెట్టిన రాలేదు. ఇప్పటి వరకు బియ్యం తీసుకోలేదు. మరునాడు పోతే గడువు ముగిసిందని ఇస్తలేరు. బియ్యం కాడికి పోతే బాగా తిప్పలు అవుతుంది. గిట్లయితే ఎట్ల. బియ్యం వచ్చేలా చూడాలి సారు. 
–మసర్తి నర్సవ్వ, బుగ్గారం

మరిన్ని వార్తలు