రారండోయ్‌.. రామప్పకు..

30 Jan, 2018 15:35 IST|Sakshi
రామలింగేశ్వరస్వామి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు

మేడారం భక్తుల సందర్శనకు ఆలయం సిద్ధం 

రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ

300 మంది పోలీసులతో బందోబస్తు

వెంకటాపురం(ఎం): మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకొని రామప్ప ఆలయాన్ని సందర్శించే మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. భక్తులు రామలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు గతంలో నిర్మించిన మినీవాటర్‌ ట్యాంకులకు మరమ్మతు చేసి  వినియోగంలోకి తెచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం తహసీల్దార్‌ ఇరుకుల శివకుమార్, ఎస్సై పోగుల శ్రీకాంత్, రామప్ప ఈఓ చిందం శ్రీనివాస్‌ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రామప్ప ఆలయం ఎదుట ఉన్న కట్ట సమీపంలో 20 మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ వాటికి తడకలు అమర్చకపోవడంతో వినియోగంలోకి రాలేదు. సాయంత్రం 6 గంటలకే ఆలయ ప్రధాన గేట్లు మూసి వేస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సరస్సు కట్టకు కాలినడకన...
భక్తుల వాహనాలను పోలీసులు రామప్ప ఆలయ శివారులోనే నిలిపివేస్తుండడంతో ఆలయాన్ని సందర్శించిన భక్తులు కాలినడకన పిల్లపాపలతో కలిసి సరస్సుకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

300 మంది పోలీసులచే బందోబస్తు
మేడారం జాతర సందర్భంగా రామప్పకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 300 మంది పోలీసు సిబ్బందిచే సేవలు అందిస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్‌ తెలిపారు. జంగాలపల్లి నుంచి గణపురం క్రాస్‌రోడ్‌ వరకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. రామప్పలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. 

పెరుగుతున్న భక్తజనం
మేడారం జాతర దగ్గర పడుతున్నకొద్దీ రామప్పలో భక్తుల రాక పెరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రతిరోజు సుమారు 15 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు రామప్పను సందర్శిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో రామప్ప ఆలయ పరిధిలో మిఠాయి దుకాణాలు, బొమ్మల దుకాణాలు, కూల్‌డ్రింక్‌ షాపులు, హోటళ్లు తదితర దుకాణాలు వెలిశాయి. రామప్ప పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.  

మరిన్ని వార్తలు