ధూపం వేస్తేనే తల్లి గుట్ట దిగేది..

31 Jan, 2018 11:56 IST|Sakshi
ధూపం వడ్డెగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర్‌రావు

తండ్రి పగడయ్య నుంచి ధూపం వడ్డెగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర్‌రావు

2015 మినీ జాతర నుంచి విధులు..

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పడిగాపూర్‌కు చెందిన దొబె నాగేశ్వర్‌రావు.. సమ్మక్క తల్లి ధూపం వడ్డెగా వ్యవహరిస్తారు. వయస్సు పైబడడంతో తండ్రి దొబె పగడయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2015 మినీ జాతర నుంచి ధూపం వడ్డెగా నాగేశ్వర్‌రావు కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఆయన తల్లి సేవలో తరిస్తున్నారు. తల్లికి ధూపం వేసే పెద్ద బాధ్యతను ఆయన యుక్తవయస్సులోనే భుజాన వేసుకున్నారు. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర సందర్భంగా చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తారు. నాగేశ్వర్‌రావు ధూపం వేస్తేనే సమ్మక్క తల్లి చిలుకలగుట్ట దిగుతుంది. 
 

డోలు దరువు తల్లులకు ఇష్టం 
జాతరలో డోలు వాయిద్య కళాకారులకు ప్రత్యేక కథ ఉంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు. డోలు వాయిద్య కళాకారుల దరువుతోనే తల్లులు కదిలొస్తారు. డోలు దరువు అంటే తల్లులకు మహా ఇష్టం. దరువు కొట్టనిది తల్లులు ఆవహించిన ప్రధాన పూజారుల అడుగు ముందుకు కదలదు. దేవతలను గద్దెలపై తీసుకురావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు డోలులు వాయిస్తూనే ఉండాలి. చిలుకలగుట్ట దద్దరిలేలా కళాకారులు తన ఒంట్లో ఉన్న శక్తిని ఉపయోగించి డోలును వాయించాలి. తల్లులను గద్దెలపై తీసుకువచ్చే క్రమంలో సమయం తెలియదని, తమకు ఏమాత్రం అలసట అనిపించదని, ఇదంతా తల్లుల మహిమేనని డోలు వాయిద్య కళాకారులు చెబుతున్నారు. అదేవిధంగా జాతరకు రెండు నెలలపాటు వచ్చిపోయే వందల మంది ప్రముఖులు, అధికారులకు డోలు వాయిద్య కళాకారులు స్వాగతం పలుకుతుంటారు. కానీ, వీరికి దేవాదాయశాఖ అధికారులు ఇచ్చే వేతనం అంతంత మాత్రమే. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డోలు వాయిద్య కళాకారులు కోరుతున్నారు.  

సమ్మక్కను తీసుకొస్తా
జాతరకు పది రోజుల ముందే చిలుకలగుట్ట వనంలో లభించే ఔషధ మూలికలతో గుగ్గిలం తయారు చేస్తాం. ఆ గుగ్గిలంతోనే ధూపం వేస్తా. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను గద్దెకు రప్పిస్తా. తండ్రి నుంచి ధూపం వడ్డె బాధ్యతలను స్వీకరించి సమ్మక్క తల్లికి సేవ చేయడం నేను మహా అదృష్టంగా భావిస్తున్నా.
–నాగేశ్వర్‌రావు, సమ్మక్క ధూపం వడ్డె  

మరిన్ని వార్తలు