ట్రాన్స్‌ఫార్మర్ల మాఫియా!

29 Jan, 2018 16:47 IST|Sakshi
మల్దకల్‌ మండలం దాసరిపల్లిలో వినియోగిస్తున్న అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్‌

మూడు రెట్లు ఎక్కువకు విక్రయం..

నలుగురి కనుసన్నల్లోనే సరిహద్దు దాటి వస్తున్న వైనం

జిల్లావ్యాప్తంగా 200 అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్లు

ఒక్కోదానికి రూ.80వేలు వెచ్చిస్తున్న రైతులు

అయినా పని చేస్తాయనే నమ్మకం లేదు

సొంత మరమ్మతులతో ప్రాణాల మీదికి..

అత్యధిక ప్రమాదాలు వీటి వద్దనే..

కనెక్షన్లు ఇవ్వని ట్రాన్స్‌కో అధికారులు

డీడీలు కట్టినా పెండింగ్‌లోనే దరఖాస్తులు

అయ్యా... చేను చేసుకుందామనుకుంటున్నా.. నీళ్లకు ఇబ్బంది అయ్యింది.. బోరులో బాగానే నీళ్లు పడ్డాయి కానీ ట్రాన్స్‌ఫార్మర్‌ లేదయ్యా... అదేదో డీడీలు కట్టాలంట కదా కడుదునా... ఆ ఏం డీడీలు రా... ఇప్పుడు కడితే ఎప్పుడు వస్తుందో ఏమో... అప్పట్లోగా నీ పంట ఎండిపోతది..  మరెట్ల అయ్యా... ఏమి లేదు ఎట్లోలాగా నేను తెప్పిస్తాను, కొంత ఖర్చు అయితది... తెచ్చిన తర్వాత ఎట్లయినా సరే కరెంటోళ్లకు చెప్పి అధికారికంగా చేయిద్దాం..  – ఇది ఐదేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్ల మాఫియా ఆడుతున్న ఆట. ఒక్కోటి రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వెచ్చించి తెచ్చిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అనేది మాఫియాకు సంబంధం లేదు. దీంతో రైతుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా తయారైంది.

సాక్షి, గద్వాల/ గద్వాల అర్బన్‌: రైతుల అవసరం.. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం వెరసి ట్రాన్స్‌ఫార్మర్ల మాఫియాకు అదనుగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు తెప్పించి రైతులకు కట్టబెడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు మాత్రం కనెక్షన్‌కు, చెడిపోతే మరమ్మతు చేయించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొం ది. అధికారులకు తెలియకుండా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవడం అసాధ్యం. ఒకవేళ ఏదైనా రిపేరు వస్తే అంతే సంగతులు.. కాస్తా కూస్తో అవగాహన ఉన్న మరికొందరు రైతులు గత్యంతరం లేక కర్నూలులోని ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతు చేయించుకుంటున్నారు. జిల్లాలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులతోపాటు ఏడు రిజర్వాయర్లు చేపట్టారు.

సాగునీరు సమృద్ధిగా ఉండటంతో ఐదేళ్లుగా పంటల విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు మండలాల్లో వేలాది ఎకరాలు వరి, వేరుశనగ, పత్తి, మిరప, పండ్లతోటల సాగు చేస్తున్నారు. కాల్వలు, బోర్ల కింద పంటలు సాగు చేసుకునేందుకు విద్యుత్‌ అవసరం ఉంటుంది. ఇదే అదనుగా రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకుని మాఫియా తెరపైకి వచ్చింది. ఇతర జిల్లాల నుంచి తక్కువ ధర, నాణ్యత లేని ట్రాన్స్‌ఫార్మర్లు తెచ్చి మూడు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నారు. అయితే డబ్బులు పోయినా పంట కాపాడుకుందామనే సంతోషం రైతుల్లో లేకుండాపోయింది. వేల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన ట్రాన్స్‌ఫార్మర్లకు కనెక్షన్‌ ఇచ్చేందుకు అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావడం, ఒకవేళ ఎలాగో ఇప్పించినా అవి పనిచేయకపోవడం, మరమ్మతుకు మళ్లీ వేల రూపాయలు ధారపోయడం రైతులకు పరిపాటిగా మారింది. అంతేకాదు తనతో కాకుండా ఇతరుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేస్తే విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు అంశాలు వెలుగు చూశాయి. నలుగురు వ్యక్తులతో కూడిన ఈ మాఫియా ఇప్పటికే కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం.

గట్టు మండలం రాయపురంలో రైతులకు  ప్రైవేట్‌ వ్యక్తులు అంటగట్టిన పనిచేయని ట్రాన్స్‌ఫార్మర్‌...,      మల్దకల్‌ మండలం దాసరిపల్లిలో అధికారులు గుర్తించిన అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్‌ ఇదే..

25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రతి 20ఎకరాలకు ఒక 25కేవీట్రాన్స్‌ఫార్మర్‌ అవసరం ఉంటుంది. సాధారణంగా డీడీ రూ.ఐదు వేలు ఉండగా ముగ్గురు, నలుగురు రైతులు కలసి దీనికోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ట్రాన్స్‌కో అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరవుతుంది. అనంతరం నాలుగు డీడీలు రూ.20వేల కలిపి 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు విద్యుత్‌ వైర్లు ఏబీ స్విచ్, ఏజ్‌ ఫ్యూజ్‌ సెట్, ఎల్‌టీ ప్యూజ్‌ సెట్, హెచ్‌టీ లైన్, ఎల్‌టీ లైన్‌తోపాటు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు దిమ్మె కోసం సుమారు రూ.30వేల వరకు వెచ్చించాల్సిందే. అయితే డీడీ తీసిన తర్వాతా ఏళ్లతరబడి దానికోసం రైతులు ఎదురుచూడాల్సిందే. తప్పని పరిస్థితుల్లో చేనును కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటు ట్రాన్స్‌ఫార్మర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా మాఫియా 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.50వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నారు. వైర్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర ఖర్చులు సరేసరి. నిబంధనల ప్రకారం దీనిని రూ.20వేలకే ఇవ్వాల్సి ఉంటుంది.

సరిహద్దులు దాటి..
సుమారు ఐదేళ్ల క్రితం బిజ్వారానికి చెందిన ఒకరు, ఇద్దరు సీడ్‌ ఆర్గనైజర్లు, ధరూరు మండలంలోని మరో వ్యక్తి కలసి ట్రాన్స్‌ఫార్మర్ల మాఫియాగా ఏర్పడ్డారు. వీరి వద్ద మరికొందరు పని చేస్తుంటారు. వీరు ఇతర జిల్లాల్లో నాణ్యత లేనివి, తక్కువ ధరకు లభించేవి, సక్రమంగా పనిచేయని ట్రాన్స్‌ఫార్మర్లను జిల్లాలోకి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సమాచారం. మల్దకల్‌ మండలంలోని దాసరపల్లి, బిజ్వారం, మల్లెందొడ్డి, ధరూరు మండలంలోని మార్లబీడులో సుమారు 80అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇలాంటి 200 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఇక తమ వద్దే, చెప్పిన ధరకే కొనుగోలు చేయాలి, ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే అనుచరులతో అధికారులకు వారే సమాచారం ఇప్పిస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంతోపాటు తెలంగాణలోని సంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల తెప్పిస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు మంజూరు చేస్తే ట్రాన్స్‌ఫార్మర్‌కు దాని సామర్థ్యం, కంపెనీ పేరు, ఉత్పత్తి చేసిన సంవత్సరం తదితర వివరాలు ఉంటాయి. కానీ మాఫియా సరఫరా చేసే దానిని అవేవి ఉండవు.

బయట చెబితే అంతే సంగతులు
అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్లతో పడుతున్న ఇబ్బందులు రైతులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు భయపడుతున్నారు. ‘సార్‌... మా వద్దకు వచ్చినట్లు తెలిస్తే కూడా ఇబ్బందే.. మేమేమీ చెప్పలేం..’ అంటూ ముఖం చాటేసి వెళ్తున్నారు. దీనిని బట్టే చూస్తే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మల్దకల్‌ మండలం దాసరిపల్లిలో నలుగురు రైతులు కలసి ఓ వ్యక్తితో ట్రాన్స్‌ఫార్మర్‌ను కొనుగోలు చేయగా ఇటీవల అధికారులు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని ఎవరి వద్ద కొనుగోలు చేశారో అతనికే మళ్లీ తిరిగి ఇవ్వాలని  బాధిత రైతులు అతడిని ఆశ్రయిస్తే నెల రోజుల వ్యవధిలోనే రూ.పది వేలు తగ్గించి తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

అసలు ఎలాంటి కనెక్షన్‌ ఇవ్వక ముందే తిరిగి తీసుకోవడానికి ఇలా డిమాండ్‌ చేస్తున్నారంటే వారు రైతులను ముంచి ఎంత సంపాదిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే గట్టు మండలంలోని రాయపురానికి చెందిన కొందరు రైతులు ఇటీవలే ఓ వ్యక్తి నుంచి రూ.45వేలకు ట్రాన్స్‌ఫార్మర్‌ కొనుగోలు చేశారు. తీరా తెచ్చుకున్న తర్వాతా పనిచేయకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చేందుకు యత్నించగా తీసుకోవడానికి ఇష్టపడనట్టు తెలిసింది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ కనెక్షన్ల సమస్య ఏదైనా ఉత్పన్నమైతే రైతులు, వినియోగదారులు సంబంధిత లైన్‌మన్, ఏఈలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురైతే జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌ మరమ్మతు కేంద్రాలకు తరలిస్తే ఉచితంగా చేస్తారు. అలాగే విద్యుత్‌ సమస్య ఏర్పడితే లైన్‌మన్, సంబంధిత అధికారులు వచ్చి సరిచేస్తారు. అయితే అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్లు కావడంతో రైతులు మరమ్మతుకు కర్నూలుకు తీసుకెళుతున్నారు. అలాగే విద్యుత్‌ సరఫరాలో సమస్య ఏర్పడితే సొంతంగా చేసుకుంటున్నారు. దీంతో కొంత అవగాహన లేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో జరిగే ప్రమాదాల్లో సుమారు 50శాతం అనధికార ట్రాన్స్‌ఫార్మర్ల వద్దే చోటు చేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.  

ఫిర్యాదు చేస్తే చర్యలు తీçసుకుంటాం
24గంటల విద్యుత్‌ సరఫరా నిమిత్తం ఆటోస్టార్టర్ల తొలగింపునకు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పర్యటిస్తుంటే ఈ అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్ల బాగోతం బయట పడింది. ఇవి మల్దకల్, ధరూరు, గద్వాల మండలాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. అయితే రైతులు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్య తీసుకుంటాం. రైతులు డీడీలు కడితే త్వరలోనే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తాం. ట్రాన్స్‌ఫార్మర్లు ప్రైవేట్‌గా కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం.
– సీహెచ్‌ చక్రపాణి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, గద్వాల


వరి చేను ఎండుతుందని..
నలుగురు రైతులం కలసి మూడు బోర్ల కింద వరినాటు వేశాం. ప్రస్తుతం కాల్వ నీళ్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని రూ.40వేలు వెచ్చించి మార్లబీడులోని ఓ వ్యక్తితో ట్రాన్స్‌ఫార్మర్‌ కొన్నాం. అయితే కొన్న తర్వాత తెలిసింది ఇది అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్‌ అని. గ్రామంలో గిట్టని వారు కొందరు ట్రాన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి పరిశీలించారు. వారి సూచన మేరకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం డీడీలు తీసి ఇవ్వగా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. అది రాకపోతే పంట ఎండిపోతది. రెంటికీ చెడ్డ రేవడిలా మా పరిస్థితి తయారైంది.
– నర్సింహులు, దాసరిపల్లి, మల్దకల్‌ మండలం

తప్పని పరిస్థితుల్లోనే..
ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం డీడీలు కట్టి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. ఆలస్యమవుతుందని పం టను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రైవేటు వ్యక్తులతో చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.25వేలకు కొనుగోలు చేశాను. రిపేరు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర ఖర్చులకు మరో రూ.50వేల దాకా వెచ్చించాను. మరమ్మతు చేయించుకోవాలంటే కర్నూలుకు తీసుకుపోవాల్సి వస్తుంది. దీనినే రెగ్యులరైజ్‌ చేస్తామనడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా.
– చింత కిష్టన్న, అమరవాయి, మల్దకల్‌ మండలం

మరిన్ని వార్తలు