వ్యవసాయ పొలంలో వెండి నాణేలు

21 Mar, 2018 15:52 IST|Sakshi
కత్తెపల్లి గ్రామంలో లభ్యమైన వెండి నాణేలు 

చదును చేస్తుండగా బయటపడిన వైనం

17 నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిజాం కాలం నాటివిగా గుర్తింపు

తవ్వేందుకు పోటీ పడిన గ్రామస్తులు 

ఆత్మకూర్‌: ఓ రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్తులు గుంపులుగుంపులుగా చేరి తవ్వకాలు జరిపారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలంలోని కత్తెపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండారెడ్డికి చెందిన పొలాన్ని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, ఆయన ద్వారా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం క్యాంపు గ్రామానికి చెందిన నారాయణరావు 22 ఎకరాల పొలాన్ని నెల క్రితం కొనుగోలు చేశారు.

ఈ మేరకు మంగళవారం ఉదయం సర్వే 123/ ఈలో ని పిల్లిగుట్ట వద్ద పొలాన్ని సాగు కోసం చదును చేస్తున్నాడు. ఈ సందర్భంగా తవ్వకాల్లో వెండి నాణేలు లభ్యం కావడంతో వ్యవసాయ కూలీల ద్వారా గ్రామస్తులకు సమాచారం చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో పొలం వద్దకు చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు దొరికినట్లు తెలుస్తుంది.

విషయం తెలుసుకున్న ఆత్మకూర్‌ సీఐ బండారి శంకర్‌ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, రైతుకు దొరికిన 17 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు నిజాం కాలం నాటివిగా గుర్తించారు. అనంతరం తహసీల్దార్‌ జెకె.మోహన్‌ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించగా. నాణేలను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. కాగా, తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. 

మరిన్ని వార్తలు