పని చేయని ఈ-పంచాయతీలు..

3 Feb, 2018 14:36 IST|Sakshi
అనంతపురంలో నిరుపయోగంగా కంప్యూటర్లు

జిల్లాలో పేరుకే ఈ–పంచాయతీలు

బాక్సులు ఏర్పాటుచేసి వదిలేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 

క్లస్టర్‌ విధానంతో ప్రజలకు తప్పని ఇక్కట్లు 

నెట్‌ సౌకర్యం లేక నిరుపయోగం

గద్వాల రూరల్‌: ఈ–పంచాయతీలంటూ ఎంతో గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యాలయాలకు కంప్యూటర్లు పంపిణీ చేసినా ఇంటర్నెట్‌ సౌకర్యం, ఆపరేటర్ల కొరత కారణంగా అవి మూలన పడ్డాయి. కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన సామగ్రి లేకపోవడం గమనార్హం. దీంతో గ్రామపంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు అన్ని సేవలు ప్రజల ముంగిట నిలపాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లాలోని 195 గ్రామ పంచాయతీలకుగాను 118చోట్ల మూడేళ్ల క్రితం ఈ–పంచాయతీ సేవలు ప్రారంభించారు.

ఒక్కో గ్రామపంచాయతీకి అప్పట్లో రూ.40వేలు విలువజేసే కంప్యూటర్‌ మానిటర్, యూపీఎస్, టేబుల్‌ తదితర పరికాలను అందించారు. ఆయా గ్రామాల్లో ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కేవలం మండల స్థాయిలోనే 12చోట్ల కొనసాగుతోంది. రెండేళ్లపాటు కంప్యూటర్‌ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించగా కాంట్రాక్టు పూర్తి కావడంతో సంబంధిత కంపెనీ ఈ–సేవల నుంచి తప్పుకొంది. అనంతరం ప్రభుత్వం గ్రామపంచాయతీల నిధుల నుంచి మండలస్థాయిలో ఆపరేటర్లకు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 10శాతం వేతనం రూపంలో వివిధ దశల్లో గ్రామపంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. మరోవైపు పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా ఈ–సేవలపై మాత్రం దృష్టి సారించడం లేదు. రెండు గ్రామ పంచాయతీలను క్లస్టర్‌గా ఏర్పరచి మండలానికి ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాలని సూచించింది. 

12రకాల సేవలు అందించాలి
ఈ–పంచాయతీల్లో భాగంగా ఇంటిపన్ను, ఆస్తి వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ వ్యయాలు, నీటి పథకాలు, కొళాయి కనెక్షన్లు, వీధిదీపాలు, వనరులు, అక్షరాస్యత శాతం, ఇంటి పన్నుల వసూళ్లు, బకాయిల వివరాలు అన్నీ కంప్యూటర్‌లోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. అంతేకాక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడంతోపాటు 12రకాల సేవలను అందించాలి. అయితే కేవలం మండల పరిషత్‌ కార్యాలయాల్లోనే కంప్యూటర్లు వినియోగంలో ఉండగా గ్రామాల్లో మూలకు చేరాయి. చాలా గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మండలం కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ–పంచాయతీల సేవలతోపాటు స్వచ్ఛభారత్, ఆసరా పింఛన్లు, హరితహారం, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన జాబితాల తయారీలో ఆపరేటర్లు బిజీగా ఉన్నారు. దీంతో తమకు పని తలకు మించిన భారమవుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.  

చాలా ఇబ్బందిగా మారింది
నాకు మూడు గ్రామ పంచాయతీలు అప్పగించారు. ఎందులోనూ ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడంతో నిధులు, లావాదేవీలు, పింఛన్లు, నీటి, ఇంటి పన్ను బకాయిలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. 
 – సురేష్, పంచాయతీ కార్యదర్శి, గోనుపాడు, గద్వాల మండలం

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడంతోపాటు ఆపరేటర్ల సమస్య కారణంగా కంప్యూటర్లు వృథాగా ఉన్నది వాస్తవమే. చాలా గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎస్‌ బ్రాడ్‌బాండ్‌ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. 
– కృష్ణ, డీపీఓ, గద్వాల   

మరిన్ని వార్తలు