యాసంగి జోరు!

30 Jan, 2018 17:06 IST|Sakshi

జిల్లాలో 1.73 లక్షల ఎకరాల్లో పంటలు

తగ్గిన మొక్కజొన్న సాగు... 

సాధారణ విస్తీర్ణాన్నిమించి వరి సాగు

ఇప్పటి వరకు94 శాతం నమోదు 

జిల్లాలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతోంది. రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. రబీలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,83,426 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,73,305 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం 94 శాతంగా నమోదైంది. మరో వారం రోజుల్లో వంద శాతం పంటలు సాగయ్యే అవకాశాలు న్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

సాక్షి, కామారెడ్డి:  జిల్లాలో వరి సాగు లక్ష్యానికి మించి నాట్లు వేశారు. 54,360 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. 61,510 ఎకరాల్లో వరి సాగైంది. మరో ఐదారువేల ఎకరాల్లో నాట్లు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద 31,913 ఎకరాల్లో, పోచారం ప్రాజెక్టు కింద 3,806 ఎకరాల్లో, కౌలాస్‌నాలా ప్రాజెక్టు కింద 3,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణంలో సగం ప్రాజెక్టుల కిందనే ఉండగా.. మిగతా సాగు విస్తీర్ణం బోర్లు, బావులపై ఆధారపడి ఉంది. 

తగ్గిన మొక్కజొన్న సాగు... 
జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం సాధారణానికం టే తగ్గింది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం  44,043 ఎకరాలుకాగా 39,554 ఎకరాల్లో మక్క వేశారు. మక్క దాదాపు బోర్లు, బావుల దగ్గరే సాగవుతోంది. 10,933 ఎకరాల్లో జొన్న సాగవుతుందని అంచనా వేయగా.. 7832 ఎకరాల్లో సాగైంది. శనగ పంట 44,903 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తే 49,316 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు సాగు గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ సాగు విస్తీర్ణం 2,458 ఎకరాలు కాగా.. 440 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారు. చెరుకు సాగు విస్తీర్ణం ఈసారి పెరిగింది. సాధారణ విస్తీర్ణం 5,883 ఎకరాలు కాగా 7,643 ఎకరాల్లో చెరుకు సాగు చేశారు.  

తగ్గుతున్న భూగర్భ జలాలు.. 
ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో బోర్లు ఎక్కువ సేపు నడుపుతున్నారు. దీంతో బోర్లలో నీటి ఊటలు తగ్గుతున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో 24 గంటల కరెంటు మరింత దెబ్బతీస్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే భూగర్భ జలమట్టం దెబ్బతిని యాసంగి పంటలకు నష్టం కలుగుతోంది. ఇదే పరిస్థితి ముందుముందు ఉంటే మరింత నష్టం తప్పదంటున్నారు.

ఎకరం వరి వేసిన... 
ఎకరం వరి పంట వేసిన. బోరు మంచిగనే పోసేది. ఈ మధ్యన బోర్ల ఊట తగ్గింది. నీళ్లకు తిప్పలైతదనే కొంత బీడు పెట్టినం. వేసిన ఎకరం పంట గూడ ఎట్ల గట్టెక్కుతదోననే భయం ఉన్నది. 24 గంటల కరెంటుతోని కొంత ఇబ్బంది అయితుంది. 
– నాగరాజు, రైతు, పోల్కంపేట, లింగంపేట మండలం 

ఇప్పుడైతే మంచిగనే ఉన్నది... 
బోర్లు మంచిగ పోస్తున్నయని మూడెకరాలల్లో వరి వేసిన. అవసరం ఉన్నంత మేరకు బోరు నడుపుతున్నం. మిగతా సమయం బందు పెడుతున్నం. ఈసారి పంట మంచిగనే ఉన్నది. మా ఊళ్లె అన్ని బోర్లు బాగానే ఉన్నయి. బోర్లు ఎత్తిపోకుంటే ఏ ఇబ్బంది ఉండదు.  
– దేవేందర్‌రెడ్డి, రైతు, ఒంటరిపల్లి, లింగంపేట మండలం 

మరిన్ని వార్తలు