ఏప్రిల్‌ 1నుంచి.. కొత్త రేషన్‌ కార్డులు 

21 Mar, 2018 18:39 IST|Sakshi
గతంలో ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తు రసీదు

మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ

ఈ–పాస్‌ అమలుతో తొలగిన అడ్డంకులు

బాన్సువాడ టౌన్‌(బాన్సువాడ) : కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి పౌరసరఫరాల శాఖ తీపికబురు అందించింది. ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
ఏడాదిగా ఎదురుచూపులు.. 
గతేడాది మే నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ నిలిపేశారు. ఈ–పాస్‌ విధానం అమల్లోకి వచ్చేంత వరకు కొత్త కార్డులు ఇవ్వడం, కార్డులో మార్పులు, చేర్పులు చేయకుండా చర్యలు తీసుకున్నారు. అప్పటికే జిల్లాలో 1,700 లకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ –పాస్‌ (ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌ ఆక్సెస్‌ సర్వీసెస్‌) విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది.

ఈ విధానం అమల్లోకి రావడంతో రేషన్‌ బియ్యం అక్రమాలకు అడ్డుకట్టపడింది. దీంతో డీలర్ల వద్ద మిగులు బియ్యం లెక్కలు బయటపడుతున్నాయి. ఈ పాస్‌ విజయవంతం కావడంతో కొత్త కార్డులు ఇవ్వాలని సివిల్‌ సప్లై అధికారులు నిర్ణయించారు. మీ సేవ కేంద్రాల్లో ఈ –పీడీఎస్‌ వెబ్‌సైట్‌ తిరిగి ప్రారంభించాలని డైరెక్టర్‌కు సూచించారు. ఈ వెబ్‌సైట్‌ వినియోగంలో రాగానే కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారు. 
 
పాత పద్ధతిలోనే దరఖాస్తులు.. 
దరఖాస్తుల స్వీకరణ పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. రేషన్‌ కార్డు కోరుకునే వారు ఆధార్‌ కార్డు తీసుకుని మీ సేవ కేంద్రాలకు వెళ్లాలి. ఈ పీడీఎస్‌ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలి. మీ సేవ కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు తహసీల్దార్‌ లాగిన్‌కు వెళ్తాయి. వాటిని తహసీల్దార్‌ పరిశీలించి విచారణ నిమిత్తం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ రెవెన్యూ కార్యదర్శికి అప్పగిస్తారు.

దరఖాస్తుదారుడి వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ఈ దరఖాస్తులు తిరిగి తహసీల్దార్‌ లాగిన్‌కు వెళ్తాయి. తహసీల్దార్‌ ఆప్రూవ్‌ చేసిన దరఖాస్తులు సివిల్‌ సప్లై అధికారుల లాగిన్‌కు చేరుతాయి. డీఎస్‌వో ఆమోదంతో కొత్త కార్డులను మంజూరు చేస్తారు. అయితే కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు ఇంకా రాలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.  

నేడు వీడియో కాన్ఫరెన్స్‌.. 
కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని సివిల్‌ సప్లై అధికారులు నిర్ణయించారు. అయితే కొత్త కార్డులకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాల గురించి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించనున్నారు. కార్డుల జారీ విషయంలో అక్రమాలకు ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానిపైన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తారని భావిస్తున్నారు.

రెండేళ్లుగా తిరుగుతున్నా 
మా బాబుకు రేషన్‌ బియ్యం వస్తున్నాయి. నాకు మాత్రం రావడం లేదు. రేషన్‌ దుకాణంలో అడిగితే కార్డులో నీ పేరు లేదు, అందుకే బియ్యం రావడం లేదు అంటున్నారు. కార్డులో పేరు చేర్చాలని రెండేళ్లుగా తహసీల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. కార్డులో పేరు చేర్చాలి. 
– మోచి విజయ, బాన్సువాడ 

ఉత్తర్వులు వచ్చాయి... 
కొత్తగా రేషన్‌ కార్డులు జారీ చేయాలని ఉన్నతాధికారులనుంచి ఉత్తర్వులు వచ్చాయి. అర్హులైనవారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కార్డుల జారీపై మార్గదర్శకాలను తెలియజేయనున్నారు.  
– రమేశ్, డీఎస్‌వో, కామారెడ్డి 

మరిన్ని వార్తలు