వీరభద్రుడి భక్తులకు ‘వృక్ష’ ప్రసాదం

14 Jan, 2018 03:13 IST|Sakshi
కొత్తకొండలో పంపిణీకి సిద్ధంగా ఉన్న పండ్ల మొక్కలు

దేవుడిని మొక్కు.. మొక్కను నాటు..

కొత్తకొండ జాతరలో లక్ష మొక్కల పంపిణీకి ఏర్పాట్లు

భీమదేవరపల్లి (హుస్నాబాద్‌): తరిగిపోతున్న వృక్ష సంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఏటా పెద్ద ఎత్తున మొక్కలను నాటుతోంది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ‘దేవుడిని మొక్కు.. మొక్కను నాటు’అనే నినాదంతో వేలేరు మండలం కన్నారం గ్రామానికి చెందిన జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి భక్తులకు మొక్కల పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. సొంత ఖర్చుతో జామ, మామిడి, తులసి, నిమ్మ మొక్కలను భక్తులకు అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. ‘వృక్ష ప్రసాదం’పేరిట బ్రహ్మోత్సవాలకు హజరయ్యే భక్తులకు ఒక్కో కుటుంబానికి ఒక్కో మొక్క, దేవుడి క్యాలెండర్‌ను ఒక బ్యాగ్‌లో భద్రపరిచి అందించను న్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌బాబు ప్రారంభించనున్నారు.

పంపిణీ ఇలా...
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యాయి. ప్రధాన ఘట్టాలైన భోగి, సంక్రాంతి, వసంతోత్సవ కార్యక్రమాలు 14, 15, 16 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. వీరికి వృక్ష ప్రసాదం పేరిట పంపిణీ చేయనున్న పండ్ల మొక్కలు ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి. మొక్కల పంపిణీ కోసం రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్‌లో ఐదుగురు అర్చకులు, 25 మంది వలంటీర్లు సేవలను అందించనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు రాగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద అర్చకుడు సదరు భక్తుడికి బొట్టు పెట్టి ఒక పండ్ల మొక్క, దేవుడి ఫొటోతో కూడిన క్యాలెండర్‌ను ప్రత్యేకంగా రూపొందించిన బ్యాగ్‌లో ఉంచి అందించనున్నారు. వృక్ష ప్రసాదం స్వీకరించే సమయంలోనే వలంటీర్లు భక్తుడి పేరు, చిరునామా, వారి ఫోన్‌ నంబరు సేకరించనున్నారు. జాతర ముగిసిన అనంతరం వరుసగా మూడు మాసాల పాటు సదరు మొక్క తీసుకున్న భక్తులకు ‘మీరు తీసుకున్న మొక్కను కాపాడండి’ అంటూ సెల్‌ ఫోన్‌కు మెసేజ్‌ పంపించే విధంగా కార్యాచరణ సైతం రూపొందించారు.

సంపూర్ణ ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దారు.. 
వృక్ష ప్రసాదం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి గతంలో తన స్వగ్రామమైన వేలేరు మండలం కన్నారం గ్రామాన్ని సంపూర్ణ ఓడీఎఫ్‌ గ్రామంగా తీర్చిదిద్దారు. సొంత గ్రామానికి కొంత సేవ చేయాలనే సంకల్పంతో గతేడాది కన్నారంలో సర్పంచ్, గ్రామస్తులు, అధికారుల కృషితో వంద శాతం ఓడీఎఫ్‌ గ్రామంగా తీర్చిదిద్దడంలో సురేందర్‌రెడ్డి సఫలీకృతుడయ్యాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రథమంగా కన్నారం గ్రామం సంపూర్ణ బహిరంగ మల విసర్జన గ్రామంగా తీర్చిదిద్దిన ఘనత సురేందర్‌రెడ్డిదే. అదే స్ఫూర్తితో తన జీవిత భాగస్వామి శ్రీదేవి ప్రోద్భలంతో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సేవే లక్ష్యంగా... 
భగవంతుడి వద్దకు వచ్చే భక్తులకు మొక్కను ఇస్తే వారు తప్పకుండా ఆ మొక్కలను రక్షిస్తారు. సీఎం చేపట్టిన హరితహార‡ కార్యక్రమం నన్నెంతో ఆకర్షించింది. అందులో నేను కూడా భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా. భగవంతుడి సన్నిధిలో మొక్కలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా.  
    –జన్నపురెడ్డి సురేందర్‌

>
మరిన్ని వార్తలు