మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

18 Jan, 2018 07:42 IST|Sakshi

డ్రగ్స్‌కు బానిస కావొద్దు, భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌

‘డ్రగ్స్‌ వాడకం–దుష్పరిణామాల’పై వాగేశ్వరిలో అవగాహన సదస్సు

అల్గునూర్‌: మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ అన్నారు. తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్‌ కళాశాలలో డ్రగ్స్‌ వాడకం–దుష్పరిణామలపై బుధవారం అవాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకర వ్యసనమన్నారు. దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్‌తో విచక్షణ కోల్పోతారని, ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదని అన్నారు. డ్రగ్స్‌ మాఫియా యువతను టార్గెట్‌ చేసుకునే చాపకింద నీరులా తమ వ్యాపారాన్ని విస్తరిస్తోందని తెలిపారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. 15 నుంచి 25 ఏళ్లలోపు యువత ఎక్కువగా మత్తుకు బానిసవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ మాఫియా సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1800–425253 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. ఎక్కువ మద్యం విక్రయాలు జరిగే మద్యం షాపుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ఆన్‌రైడ్‌ అప్లికేషన్‌ కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దీనిద్వారా ఫిర్యాదు చేస్తే టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్‌ సిబ్బందికి వెంటనే సమాచారం అందుతుందని పేర్కొన్నారు.

సమాజసేవపై దృష్టి పెట్టాలి..
యువత సమాజసేవపై దృష్టి సారించాలని అకున్‌సబర్వాల్‌ సూచించారు. సేవచేయాలనే ఆసక్తి ఉన్నవారికి సివిల్‌ సర్వీసెస్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు డ్రగ్స్‌కు సంబంధించిన అడిగిన పలు ప్రశ్నలకు అకున్‌సబర్వాల్‌ ఓపికగా సమాధానాలు చెప్పారు. కొంతమంది విద్యార్థులు మద్యనిషేధం అమలు చేయాలని కూడా కోరడం గమనార్హం. అనంతరం అకున్‌సబర్వాల్‌ను కళాశాల సంయుక్త కార్యదర్శి డి.శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి, కరీంనగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, రావికుమార్, డిప్యూటి కమిషనర్‌     వెంకటేశ్‌నేత, జిల్లా ఎక్సైజ్‌ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన అకున్‌..
హరితహారం కార్యక్రమంలో భాగంగా అకున్‌సబర్వాల్‌ వాగేశ్వరి కళాశాల ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా విద్యార్థులు, యువతే తీసుకోవాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణం, తాగునీరు అందించాలంటే విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు.

మరిన్ని వార్తలు