కల సాకారమవుతోంది.. 

9 Mar, 2019 10:26 IST|Sakshi
మద్దుల చెరువు మినీ ట్యాంకు బండ్‌ ఊహా చిత్రాలు, సుందరీకరణ ఊహాచిత్రాలు

సాక్షి, కోరుట్ల: పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మద్దుల చెరువు మినీట్యాంక్‌ బండ్‌ ఏర్పాటు కల సాకారమవుతోంది. ఇప్పటికే సుమారు రూ. 3.50 కోట్లు  కేటాయించి పూడికతీత, పుట్‌పాత్, గేట్లు, బతుకమ్మ ఘాట్లు, బండ్‌ నిర్మాణం పూర్తి కాగా..ట్యాంక్‌ బండ్‌ సుందరీకరణ పనులు కొంత మేర మిగిలిపోయాయి. ఈ పనుల కోసం ఆరు నెలల క్రితం అప్పటి మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన నిధుల రూ. 25 కోట్ల నుంచి రూ. 33 లక్షలు కెటాయించారు. ఈ నిధులతో మినీట్యాంక్‌ బండ్‌గా మారిన మద్దుల చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. 
 

కొత్త సోయగాలు..
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఉన్న మద్దుల చెరువును దాదాపుగా మినీట్యాంక్‌ బండ్‌ రూపం సంతరించుకుంది. నిర్మాణపరమైన పనులు పూర్తి కాగా.. మినీ ట్యాంకు బండ్‌ సుందరీకరణ పనులు మిగిలిపోయాయి. ఈ పనుల్లో బాగంగా ఫిట్‌నెస్‌ ఓపెన్‌ జిమ్, కట్టపై పార్కులు, అందమైన ఆకృతులతో నిర్మాణాలు, చెట్లు, గడ్డిమొక్కలు పెంపకం, ఫుట్‌పాత్‌ పక్కన అందంగా ఉండటానికి అవసరమైన బొమ్మలు, బతుకమ్మ ఘాట్‌ వద్ద చిన్నపాటి గద్దెల నిర్మాణం వంటి వాటి కోసం ఈ నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు చెందిన టెండర్లు త్వరలో పూర్తి కానున్నాయి. 
 

మరో రూ. 50లక్షలు 
మినీట్యాంక్‌ బండ్‌లో నీటిని ఎప్పకప్పుడు శుద్ధీకరణ చేయడానికి అవసరమైన సాంకేతికతను ఏర్పాటు చేయడంతో పాటు మిషన్‌ భగీరథ పైప్‌లను అనుసంధానం చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉంది. ఈ పనుల కోసం మరో రూ. 50లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నిధులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. త్వరితగతిన  ఈ నిధులు మంజూరైతే కోరుట్ల మద్దుల చెరువుకు చెందిన దాదాపు అన్ని పనులు పూర్తి అయినట్లే. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది కాలం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు