‘గంగవ్వ’ ఎరుకనే కదా..!

8 Mar, 2019 16:20 IST|Sakshi
ఓ సన్నివేశంలో గంగవ్వ

పల్లెటూరి నుంచి  ప్రపంచస్థాయికి..

గంగవ్వకు పేరుతెచ్చిన ‘మైవిలేజ్‌ షో’ 

టీవీఛానళ్లు.. సినిమాల్లో అవకాశం

సాక్షి, మల్యాల(పెద్దపల్లి): అచ్చమైన తెలంగాణభాష ఆమె సొంతం. అమాయకమైన చూపులు.. శివాలెత్తే మాటలకు కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్‌ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ దినసరి కూలీ. తనకు రాని నటనతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మై విలేజ్‌షో అనే ఛానల్‌తో యూ ట్యూబ్‌ ఐకాన్‌గా మారింది. గంగవ్వ కనపడితే చాలు ఒక్క సెల్ఫీ అంటూ యువత పోటీ పడుతున్నారు. నటనతెలియని గంగవ్వకు ఏకంగా పూరి జగన్నాథ్‌ లాంటి డైరెక్టర్లు ఆఫర్‌ ఇవ్వడం ఆమె ప్రతిభకు నిదర్శనం.

వ్యవసాయ కూలీనుంచి..

మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ ఉరఫ్‌ మై విలేజ్‌ షో గంగవ్వ వ్యవసాయ కూలీ. డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్‌ పట్టా పొందిన అదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్‌ పల్లెటూరి సంస్కృతిని చాటిచెప్పేందుకు మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ఛానల్‌ను దాదాపు ఐదేళ్లక్రితం ప్రారంభించాడు. తమ ఇంటి సమీపంలో ఉండే గంగవ్వ హుషారుతనం.. చలాకీ మాటలు.. అచ్చ తెలంగాణభాషను గుర్తించాడు. తన ఛానల్‌లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. అలా సాగిన తన ఐదేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు గంగవ్వ లేనిదే  మై విలేజ్‌షో లేదు అనేంతగా ఫేమస్‌ అయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..

గంగవ్వ మై విలేజ్‌ షో షార్ట్‌ ఫిల్మ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానల్‌లో ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది. ప్రతీ వీడియోలో తన ప్రత్యేకతను చాటుకుంది. మొన్నటి సంకాంత్రికి భీమవరంలో కోడిపందాలకు పోటీలు, తరువాత వచ్చిన ఎన్నికల్లో తీరును విశ్లేషిస్తూ ‘సెటైరికల్‌గా సర్పంచ్‌ గంగవ్వ’, నిన్నటి శివరాత్రి మహాత్యం వివరించే శివరాత్రి జాగారణ పేరుతో యూట్యూబ్‌ వీడియోలు  తీస్తూ తన యాస,మాట తీరుతో గుర్తింపు పొందింది. ఓ వార్తాఛానల్‌లోని ప్రోగ్రాంలో ఏడాదిపాటు నటించింది.

మరో వార్తాఛానల్లో రెండు పండుగ ఎపిసోడ్లు చేసింది. ఇటీవల హైదరాబాద్‌ రవీంద్రభారతిలో శనివారం నాడు ఏర్పాటుచేసే ‘సినీవారం’లో సత్కారం పొందింది. సినీ హీరో విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, హీరోయిన్‌ సమంతను కలిసింది. వాళ్లే గంగవ్వ నటనను యూట్యూబ్‌లో చూసి ఆహ్వానించడం విశేషం.

గంగవ్వతో ఒక్క సెల్ఫీ..

ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, గంగవ్వ మాటలు, తిట్లకు సంబరపడిపోతున్నారు యువత. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. పల్లెటూరి యాసతోపాటు మాటతో ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నుండి పట్నం దాకా ఎక్కడికివెళ్లినా గంగవ్వ ఒక్క సెల్ఫీ అంటూ ఎగబడుతున్నారు.

చెప్పింది చేసుడే తెలుసు..

వ్యవసాయ పనికి పోయేదాన్ని. పని లేనప్పుడు బీడీలు చేసేదాన్ని. శ్రీకాంత్‌ మా వీడియోలో నటిస్తవా అని అడిగిండు. నాకు నటించుడు రాదు..నువ్వు చెప్పింది సేత్త అన్న. శ్రీకాంత్‌ చెప్పింది చెప్పినట్లు చేస్త గంతే. ఎవుసం పనిచేసుకునేదాన్ని తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిండు శ్రీకాంత్‌. సినిమాల్లో నటించు అంటే నా ఊరిని ఇడిసి ఎక్కడికి రాను అని చెప్పిన. మొన్న డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ నన్ను పిలిచి సినిమాల నటించుమంటే నటించుడు రాదు సారు..మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా అంటే కొద్దిసేపు ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో తీసుకున్నడు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనిచేసిన మంచిగనే ఉంటాం.
– గంగవ్వ 

మరిన్ని వార్తలు