వాగులోకి కాలువ నీరు

14 Feb, 2018 15:23 IST|Sakshi

మత్తడిదూకుతున్న ముత్తారం చెరువు

ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు అందని నీరు

శంకరపట్నం : కేశవపట్నం వాగులోకి ఎస్సారెస్పీ ప్రధానకాలువ నీటిని విడుదల చేయడంతో ముత్తారం చెరువు మత్తడి దూకుతోంది. ఎల్‌ఎండీ ప్రాజెక్ట్‌ నుంచి ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తుండగా ఆదివారం నిలిపివేశారు. ఉపకాలువల ద్వారా చివరి ఆయకట్టుకు సాగు నీరందకపోవడంతో రైతులు కాలువ వెంట తిరుతున్నారు. డీబీఎం–13 కాలువ నుండి 8ఎల్‌ ఉపకాలువలో పేరుకుపోయిన పూడికను ఆదివారం కన్నాపూర్‌ రైతులు శ్రమదానంతో తొలగించారు. కాగా కన్నాపూర్, కాచాపూర్, ధర్మారం, గద్దపాక, అర్కండ్ల రైతుల  పంటలకు నీరందుతుందని ఆశిస్తే కేశవపట్నం ఎస్కేఫ్‌ గేటు ఎత్తడంతో కేశవపట్నం వాగు ప్రవహిస్తోంది. ఈ నీరు ముత్తారం చెరవు నిండిపోవడంతో కల్వల ప్రాజెక్ట్‌లోకి నీరు చేరనుంది.

వాగువెంట రైతులకు మేలు
కేశవపట్నం వాగులో ఎస్సారెస్పీ కాలువ నీటిని విడుదల చేయడంతో ఈ వాగుపై ఆధారపడిన పంటలకు సాగునీరంది రైతులకు లాభం చేకూరనుంది. కేశవపట్నం, మక్త, ముత్తారం, ఏరడపెల్లి, అర్కండ్ల వాగులతో నీరు ప్రవహించి కల్వల ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఈ ప్రాంత రైతులు సాగు చేసిన పంటలకు నీరందిస్తున్నారు. కల్వల ప్రాజెక్ట్‌ నీరు నిండితే ఈ ప్రాజెక్ట్‌ కింద రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి డోకా ఉండదు. వాగు ప్రవహిస్తే సమీపంలో వ్యవసాయబావిలో నీటి ఊటపెరిగి పంటలకు  నీరు సమకూరనుంది. వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరాఫరా చేస్తుండడంతో కాలువ వెంట సాగు చేసిన వరిపంటలకు ఇబ్బందులు తీరనున్నాయి.

చివరి ఆయకట్టుకు అందని నీరు
ఎస్సారెస్పీ ప్రధానకాలువతో యాసంగి సాగుకు నీటిని విడుదల చేయగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు గస్తీతిరుగుతున్నారు. రోజుకో ప్రాంతానికి నీటిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నా... నీటి తడులు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు తడులు ఉందించినా చివరి ఆయకట్టుకు సాగు నీరందని రైతులు కళ్లముందే పంట ఎండుతున్నా చేసేదీ లేక రైతులు దిగులు చెందుతున్నారు.

 నీరందడం లేదు
కాచాపూర్‌ గ్రామంలో డీబీఎం– 15 కాలువతో నీటిని విడుదల చేస్తున్నారు. కాలువ నీళ్లు వత్తయని 6 ఎకరాల్లో వరిపంట సాగు చేసిన. మూడు రోజులు కాలువ చుట్టూ తిరిగితే నీళ్లు అచ్చినయ్‌. మళ్లీ కాలువకాడికి వెళ్తే నీళ్లు బంద్‌ చేసిండ్రని తెలిసింది. వేసిన పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలి.    
 – మల్గిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, కాచాపూర్‌

మరిన్ని వార్తలు