పకడ్బందీగా పాస్‌ పుస్తకాలు!

17 Jan, 2018 08:30 IST|Sakshi

మార్చి 11న రైతులకు పంపిణీ చేయాలి

కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

‘పంచాయతీ’కి సన్నద్ధం కావాలని సూచన

ఫిబ్రవరిలో జరిగే అవకాశముందని వెల్లడి

పథకాల అమలుపైనా సమీక్ష

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 11న నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం కోసం.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఊరికో నోడల్‌ అధికారిని నియమించడంతోపాటు రైతులకు అదేరోజున అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, గ్రామ పంచాయతీల ఎన్నికలు, అభివృద్ది పథకాల అమలు తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష జరిపారు.  
బోగస్‌ దందాలకు ఇక సెలవు..

16 అంశాలతో పాసుబుక్కుల ముద్రణ
ప్రభుత్వం పకడ్బందీగా రూపొందించే ఈ–పాస్‌పుస్తకాలతో బోగస్‌ దందాలకు తెర పడుతుందని, 16 రకాల రక్షణ ప్రత్యేకతలతో పాసుబుక్కులను రూపొందించామని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు సూచించారు. భూస్వామ్య వ్యవస్థ అంతకంతకు తగ్గిపోగా.. సన్న, చిన్నకారు రైతులతో పాటు భూమి ఉన్న ప్రతిఒక్కరికీ పాసు పుస్తకాలు అందేలా చూడాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేందుకు గ్రామానికో నోడల్‌ అధికారి ని నియమించాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ వ్యవహారంలో రెవెన్యూశాఖ మరింత కీలకంగా     వ్యవహరించాలని, తహసీల్దారు, నాయబ్‌ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ల బాధ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్‌ సవరణల ప్రకారమే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడినా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వంసన్నద్ధం కావాలని సూచించారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతోపాటు, తండాలను పంచాయతీలుగా మార్చే జాబితాపైనా చర్చించారు.

ఉమ్మడి కరీంనగర్‌లో 6,62,345 రైతులు.. ఆ మేరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘గణాంకాల పుస్తకం–2017’,  భూరికార్డుల సర్వే ప్రకారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం భూమి 29,55,750 ఎకరాలుండగా, అటవీ, బంజరు, నివాస స్థలాలను మినహాయిస్తే సాగుభూమి 13,42,045 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఆహార పంటలు 7,88,975 ఎకరాలు కాగా, వాణిజ్య పంటలు 5,53,070 ఎకరాల్లో సాగవుతున్నాయి. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 6,62,345 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. 5,09,098 పాసు పుస్తకాలు చెలామణిలో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ–పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంతో కొత్త వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వ్యవసా య భూములు, చిన్న, సన్నకారు, పెద్ద రైతుల సం ఖ్య ఆధారంగా పాసు పుస్తకాలను ముద్రిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు మార్చి 11న పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ–పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు, పండుగ వాతావరణంలా నిర్వహించేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనం చేసినట్లు తెలిసింది. సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సర్ఫరాజ్‌ అహ్మద్, శరత్, కృష్ణభాస్కర్, శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.


పరిధి    రైతులు    భూమి(ఎకరాల్లో)
1.25 ఎకరాల వరకు    2,74,368    1,78,063.75
1.25 నుంచి 2.5    1,72,669    315075.75
2.5 నుంచి 5    1,45,008    5,07,758.55
5 నుంచి 7.5    41,805    2,48,635.075
7.5 నుంచి 10    13,585    1,16,427.2
10 నుంచి 12.5    6,994    77,462.1
12,5 నుంచి 18.75    5,397    80,517.3
18.75 నుంచి 25    1,438    30,583.15
25 నుంచి 50    935    29,827.875
50 ఎకరాల పైన    146    12375.17

మరిన్ని వార్తలు