మైనర్లూ బహుపరాక్‌ !

22 Jan, 2018 07:23 IST|Sakshi

తల్లిదండ్రులూ ఆలోచించండి..

మైనర్లు వాహనం నడిపితే కేసు

యజమాని సైతం కోర్టుకు రావాల్సిందే..

కమిషనరేట్‌ పరిధిలో కొత్త చట్టం.

కరీంనగర్‌ క్రైం:  పదో తరగతిలో ఫస్ట్‌క్లాస్‌ మార్కులు వచ్చినందుకు కొడుకుకి బైక్‌ కానుకగా ఇచ్చే తల్లిదండ్రులు.. ఇంటర్‌ కాలేజీకి బస్సులో వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న పుత్రరత్నాన్ని చూసి స్పోర్ట్స్‌ బైక్‌ కొనిచ్చే పేరెంట్స్‌ ఒక్క నిమిషం ఆలోచించండి. పట్టుమని పదహారేళ్లు దాటని మీ పిల్లలు బైక్‌లు నడుపుతూ.. ప్రమాదాలు చేస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఒక వేళ పోలీసులకు చిక్కితే జువైనల్‌ జైలుకు వెళ్లాల్సిందే. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఇక కఠిన శిక్షల అమలుకు కమిషనరేట్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లకు బైక్‌లు కొనిచ్చే తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.

కొత్త చట్టం  
పద్నాలుగు, పదహారేళ్ల వయస్సులోనే బైక్‌లపై రివ్వున వెళ్లే యూత్‌ను కట్టడి చేసేందుకు పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి కొత్త చట్టం అ మలుకు శ్రీకారం చుట్టారు. మైనర్లు బైక్‌లు నడిపితే..మొదట తల్లిదండ్రులకు నోటీస్‌లు జారీ చేస్తా రు. బాల డ్రైవర్లపై జువైనల్‌ కోర్టులో అభియోగప్రతం(చార్జిషీట్‌) దాఖలు చేయనున్నా రు. కరీంనగర కమిషనరేట్‌లో కఠినంగా అమ లు చేయడానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి జువైనల్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి వారికి శిక్షలు కూడా వేశారు.  

పక్కాగా అమలుకు శ్రీకారం  
కరీంనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు ఇంజినీరింగ్‌ ఉన్నాయి. ఇటీవల పలువురు మైనర్లు బైక్‌లు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో మైనర్ల బైక్‌రైడింగ్‌కు చెక్‌ పెట్టేందుకు సీపీ ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ మైనర్లకు మొ దట వారి  కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తారు. అయినా వారిలో మార్పు రాకపోతే కఠిన చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేశారు. 2015లో హైదరాబాద్‌ సెం ట్రల్‌ జోన్‌ డీసీపీగా ఉన్న సమయం లో కమలాసన్‌రెడ్డి  అక్కడ మైనర్‌ డ్రైవింగ్‌లపై దృష్టి సారించి పలు చట్టా లు అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. అదేవిధంగా కరీంనగర్‌లో అమలు చేయనున్నారు. ఇప్పటికే సుమారు ఆరుగురు మైనర్లపై కేసులు నమోదు చేసి జువైనల్‌ కోర్టులో ప్రవేశపెట్టారు.

వాహన యజమానికీ శిక్ష!  
భారత మోటార్‌ వాహన చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు వారు ఎలాంటి వాహనాలు నడపకూడదు. 18 ఏళ్ల నిండిన తర్వాతనే గేర్లతో కూడిన వాహనాలు నడపాలి. వారికే డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తారు. అయితే ఈక్రమంలో మైనర్లకు వాహనాలు ఇచ్చే వారు సైతం శిక్షార్హులే. వీరిని సైతం కోర్టులో ప్రవేశపెడతారు. మైనర్‌ డ్రైవింగ్‌లో ప్రమాదం చేస్తే.. వాహనం నడిపిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లలో కఠినమైన కేసులు నమోదు చేస్తారు. వీరికి వాహనం ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి నిర్ణయం ప్రకారం శిక్షలు ఖరారు చేయనున్నారు.  

మైనర్లు పాల్పడే ఉల్లంఘనలు  
హైదరాబాద్, సైబరాబాద్‌లలో కొన్ని స్వచ్ఛంద సం స్థలు మైనర్లు ఎలాంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు  పాల్పడుతున్నారో అధ్యయనం చేసింది. వాటి ప్రకారం ముఖ్యంగా మైనర్లు 12 రకాల ఉల్లంఘనకుల పాల్పడుతున్నారని గుర్తించారు. హెల్మెట్‌ లేకుండా, సిగ్నల్‌ జంపింగ్, ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, ట్రిపుల్‌ రైడింగ్, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్, ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్ల వినియోగం, డ్రైవింగ్‌ అవగాహన లేకుండా అడ్డదిడ్డంగా నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కల్గిస్తారని గుర్తించారు.

విదేశాల్లో కఠిన చట్టాలు
విదేశాల్లో మైనర్లు వాహనాలు నడిపితే వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. భారీగా జరిమానా విధిస్తారు. మైనర్లు, తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇస్తారు. తల్లిదండ్రులకూ భారీగా జరిమానాలు విధిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఉన్న వారు కూడా మూడుసార్లు నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్‌లైసెన్స్‌లు రద్దు చేస్తారు. ఒక్కసారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దయితే మళ్లీ పునరుద్ధరించరు.

కఠినంగా అమలు చేస్తాం
కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో మైనర్లకు అవగాహన కల్పించాం. కౌన్పెలింగ్‌లు నిర్వహించాం. అయినా ప్రమాదాలు తగ్గడం లేదు. వాటిని కట్టడి చేయడానికి చట్టం అమలు చేస్తున్నాం. మైనర్‌ వాహనం నడిపి ప్రమాదాలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు